వీలున్నంత వరకూ తెలంగాణ పీసీసీ ఎందుకనో వైఎస్సార్ ఫొటోను వాడుకోకుండానే ఎన్నికలకు వెళ్లాలని భావిస్తోంది. ఈ క్రమంలో కొన్ని తప్పిదాలు కూడా చేస్తోంది. అయితే వీటి కారణంగా రేవంత్ రెడ్డి మైలేజ్ పెరుగుతుందా తగ్గుతుందా అన్నది అటుంచితే, మునుగోడు ఉపఎన్నికపై దాని ప్రభావం తప్పక ఉంటుంది. ఓ వైపు పీజేఆర్ ను స్తుతిస్తున్న రేవంత్ రెడ్డి మరోవైపు వైఎస్సార్ ను మాత్రం స్మరించడం లేదు. ఇది కూడా ఓ విధంగా కాంగ్రెస్ పార్టీ మైలేజీని దెబ్బ తీయవచ్చన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయితే రేవంత్ వ్యూహం వేరుగా ఉంది.
పార్టీలో వైఎస్సార్ హవా ఇప్పటికీ ఏదో ఒక విధంగా పరోక్షంగా కొనసాగుతోంది కనుక వాటిని అడ్డుకునేందుకే తెలివిగా ఈవిధంగా ఆయన ప్రవర్తించి ఉంటారన్న వాదన కూడా ఉంది. మరోవైపు వైఎస్సార్టీపీ పేరిట షర్మిల పార్టీ పెట్టడంతో ఎందుకొచ్చిన గొడవ అన్న విధంగా వైఎస్సార్ బొమ్మను మునుగోడు కార్యకర్తలకు సంబంధించిన పోస్టర్లలో ప్రచురించలేదు అని కూడా తెలుస్తోంది.
ఏదేమయినప్పటికీ జంట నగరాల్లో బలోపేతం కావాలన్నా మరోచోట కాంగ్రెస్ జెండా ఎగురవేయాలన్నా అటు పీజేఆర్ ను కానీ ఇటు వైఎస్సార్ ను కానీ విస్మరించి రాజకీయం చేయలేని విధంగానే పరిస్థితులున్నాయి. వైఎస్సార్ నామస్మరణ చేస్తే ఎక్కడ షర్మిల టీంతో విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని కాంగ్రెస్ పార్టీ వైఎస్సార్ పై పేటెంట్ వద్దనుకునేందుకు, వదులుకునేందుకు సిద్ధంగా ఉంది అని కూడా తెలుస్తోంది.
కానీ పార్టీలో ఉన్న వైఎస్సార్ అభిమానులు మాత్రం ఆయన జయంతులను, వర్థంతులను నిర్వహించేందుకే ఎక్కువగా ఇష్టపడుతున్నారు. ఆ విధంగా వైఎస్ఆర్ లేకుండా కాంగ్రెస్ లేదని చెప్పకనే చెబుతున్నారు. కానీ వీరికి భిన్నంగా తెలంగాణ కాంగ్రెస్ మాత్రం వ్యవహరిస్తోంది. ఎక్కడా దివంగత నేత బొమ్మ లేకుండా రాజకీయం చేయాలని భావిస్తుంది. ఇదే సమయాన పీజేఆర్ స్మరణకు ఎక్కువగా ప్రాధాన్యం ఇస్తుండడంతో వైఎస్ అభిమానులకు కాస్త కోపం పెరిగిపోతోంది.
Comments 1