ఏపీలో ఆల్రెడీ 2024 ఎన్నికల వేడి రాజుకున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే ఏ పార్టీకి విజయావకాశాలు ఎంత ఉన్నాయి? ఎవరికి టికెట్లు దక్కుతాయి? ఎవరెవరు పార్టీ మారబోతున్నారు అన్న విషయాలపై తీవ్ర చర్చ జరుగుతోంది. ఆల్రెడీ వైసీపీకి పీకే తోపాటు జగన్ చేయించిన సొంత సర్వేలు ప్రతికూలంగా ఉన్నాయని, అందుకే చాలామంది వైసీపీ ఎమ్మెల్యేలు టీడీపీ వైపునకు మొగ్గు చూపుతున్నారన్న టాక్ వస్తోంది.
ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. నేనే వైసీపీలో శాశ్వతంగా ఉంటానా? రేపు ఎవరు ఏ పార్టీ నుంచి పోటీ చేస్తారో ఎవరికి తెలుసు? అంటూ చంటిబాబు చేసిన హాట్ కామెంట్లు పొలిటికల్ హీట్ ను పెంచాయి. ‘పార్టీలు, గాడిద గుడ్డు ఈ రోజు ఉంటాయి. రేపు పోతాయి. ఏం… మేమైనా శాశ్వతమా ఈ పార్టీలో. చెప్పండి.. ఎవరు ఏ పార్టీలో శాశ్వతంగా ఉన్నారో చెప్పండి. రేపన్న రోజు ఏ పార్టీ నుంచి ఎవరు పోటీ చేస్తారో ఎవరికి తెలుసు?’ అని చంటిబాబు షాకింగ్ కామెంట్లు చేశారు.
ఏ ఒక్కరూ ఏ ఒక్క పార్టీకో పరిమితం కాదని, ఒక పార్టీకి చెందిన నాయకుడు వేరే పార్టీలోకి మారడం సహజమని తత్వం బోధపడేలా సెలవిచ్చారు చంటిబాబు. ప్రజలు తనకు అవకాశమిచ్చారని, ప్రజా సేవ చేసేందుకు అందరితో కలిసి ముందుకు వెళ్తానని చంటిబాబు అన్నారు. తాను ఉన్నంతవరకు సక్రమంగా చూసుకోవడం తన బాధ్యత అని, టెక్నికల్ సమస్యలు ఉంటే సానుకూలంగా స్పందించి అవకాశం ఉన్నంతవరకు బాధితులకు సంక్షేమ పథకాలు అందేలా చూడాలంటూ అధికారులను ఆదేశించారు.
తన సొంత నియోజకవర్గంలో కొత్త పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన సందర్భంగా పెన్షన్ పంపిణీకి సంబంధించి ఎదురవుతున్న ఇబ్బందులపై ప్రసంగిస్తూ చంటిబాబు ఈ కామెంట్స్ చేశారు. దీంతో, వైసీపీ నాయకత్వం పట్ల అసంతృప్తితోనే చంటిబాబు ఈ వ్యాఖ్యలు చేశారని సోషల్ మీడియాలో కామెంట్లు వస్తున్నాయి. తాను పార్టీ మారబోతున్నానంటూ ఈ కామెంట్లతో చంటిబాబు ముందే సంకేతాలు ఇచ్చారంటూ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ జరుగుతుంది.
మరోవైపు, నియోజకవర్గంలో అసమ్మతి, వైసీపీలో ఇమడలేకపోవడంతోనే చంటిబాబు ఇలా మాట్లాడారని అంటున్నారు. అయితే, చంటిబాబు కామెంట్లపై వైసీపీ అధినాయకత్వం సీరియస్ గా ఆరా తీస్తున్నట్లు తెలుస్తోంది. తన నియోజకవర్గంలో పనులు జరగడం లేదని, గడపగడపకు కార్యక్రమంలో అసమ్మతి సెగలు తగలడంతోనే అసహనంతో చంటిబాబు ఈ వ్యాఖ్యలు చేశారనే ప్రచారం కూడా జరుగుతుంది. కాగా, 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ తరుపున జగ్గంపేట నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓటమిపాలైన జ్యోతుల చంటిబాబు 2019 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరి జ్యోతుల నెహ్రూపై విజయం సాధించారు.