కొంతకాలంగా ఏపీలో రాజకీయాలననీ మద్యం చుట్టూ తిరుగుతున్నాయి. ఏపీలో దశలవారీగా మద్యపాన నిషేధం అంటూ అధికారంలోకి వచ్చిన జగన్…ఆ తర్వాత మద్యం ఏరులై పారిస్తున్నారు. ఇదేంటి మీరిచ్చిన హామీ ఏమైందని వైసీపీ నేతలను అడిగితే…అసలు మేనిఫెస్టోలో మద్యపాన నిషేధమే లేదంటూ మంత్రి గుడివాడ అమర్నాథ్ రెడ్డి వంటి వారు బుకాయిస్తున్నారు. ఇక, తాజాగా దిల్లీలోని మద్యం టెండర్ల వ్యవహారంల ో వైసీపీ ఎంపీ మాగుంట శ్రీనివాసులు పేరు మార్మోగిపోతోంది. ఆప్ ప్రభుత్వాన్ని మాగుంట ఇరకాటంలో పడేశారని టాక్ వస్తోంది.
దిల్లీ మద్యం పాలసీ ద్వారా కొన్ని కంపెనీలకు ప్రయోజనం కలిగించారని ఆప్ ప్రభుత్వంపై బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది. రూ.144 కోట్ల మేర అక్రమాలకు పాల్పడిందని ఆరోపిస్తోంది. అలా లబ్ధి పొందిన కంపెనీల్లో మాగుంటకు చెందిన కంపెనీలు కూడా ఉన్నాయి. అయితే, దిల్లీ మద్యం విధానంలో తమకు లబ్ధి జరిగిందనే ప్రచారంలో వాస్తవం లేదని మాగుంట చెబుతున్నారు. మద్యం విక్రయాల బాధ్యత నుంచి ప్రభుత్వం తప్పుకొని ప్రైవేటు సంస్థలకు అప్పగించింది. ఈ విధానం వల్ల గతం కన్నా ఎక్సైజ్ ఆదాయం 27 శాతం పెరిగి రూ. 890 కోట్లకు చేరుకుందని ప్రభుత్వం వెల్లడించింది.
ఎంఆర్పీ కన్నా తక్కువ ధరలకు మద్యం అందించేలా ప్రభుత్వం ప్రోత్సహించింది. పలు బ్రాండ్లపై ఎంఆర్పీ కన్నా తక్కువ ధరకు మద్యం అందుబాటులోకి రావడంతో దిల్లీలో అమ్మకాలు పెరిగాయి. దీంతో, ఎక్సైజ్ టెండర్ల కేటాయింపు, డిస్కౌంట్లు అందించే ప్రక్రియలో అవకతవకలు జరిగాయని బీజేపీ ఆరోపిస్తోంది. బ్లాక్ లిస్టులో పెట్టిన కొన్ని కంపెనీలను టెండర్ ప్రక్రియలో అనుమతించారని బీజేపీ నేతలు ఆరోపించారు.
బ్లాక్ లిస్టులో ఉన్న ఖావో గాలి, ఎంపీ మాగుంట శ్రీనివాసుల రెడ్డికి చెందిన కంపెనీతో పాటుగా ఇండో స్పిరిట్ కలిసి సిండికేట్ అయ్యి బిడ్లు గెలుచుకున్నారు. చివరకు ఈ వివాదం కారణంగా దిల్లీ ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకుంది. 9 నెలల తర్వాత తన మద్యం విధానం వెనక్కి తీసుకుంది. మళ్లీ ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం అమ్మకాలకు శ్రీకారం చుడతామని చెప్పింది. సెప్టెంబరు 1 నుంచి పాత విధానం అమల్లోకి వస్తుందని చెప్పింది. బీజేపీ నేతలు ఆరోపించే సమయంలో వైసీపీ ఎంపీ మాగుంట పేరుని కూడా ప్రస్తావించడంతో కేజ్రీవాల్ ను మాగుంట ఇరకాటంలో పడేసినట్లయింది.
Comments 1