టీడీపీ సీనియర్ నేత అయ్యన్న పాత్రుడిని ఏపీ సర్కార్ కొంతకాలంగా ఇబ్బంది పెట్టాలని ప్రయత్నిస్తున్న సంగతి తెలిసిందే. అయ్యన్న ఇంటి ప్రహరీ గోడ కూల్చడం, దానిపై అయ్యన్న కోర్టుకు వెళ్లడం, ఆ తర్వాత అయ్యన్న తన ఇంటి ప్రహరీ గోడను తిరిగి కట్టుకోవచ్చని కోర్టు తీర్పునివ్వడం తెలిసిందే. అయితే, ఆ వ్యవహారం సద్దుమణిగా…ఎలాగోలా అయ్యన్నపై అక్కసు వెళ్లగక్కుతున్నారు జగన్. అందుకే, ఏదో ఒక కేసులో అయ్యన్నను అరెస్టు చేయాలని పోలీసులు కాచుకు కూర్చున్నారు.
ఈ క్రమంలోనే న్యాయస్థానాలున్నాయి కాబట్టి రాష్ట్రంలో బతగ్గలుగుతున్నామని, లేదంటే తమలాంటి వారిని కొట్టి చంపేసి ఉండేవారని అయ్యన్న షాకింగ్ కామెంట్లు చేశారు. ఎంపీ రఘురామకృష్ణరాజును సీఐడీ కస్టడీలో కొట్టించినట్టు తనను కూడా కొట్టించాలని చూస్తున్నారని ఆరోపించారు. శని, ఆదివారాల్లో పోలీసులు తన ఇంటి చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు. ఈ క్రమంలోనే అయ్యన్న తన ఇంటి దగ్గర పోలీసులు తచ్చాడడంపై హైకోర్టును ఆశ్రయించారు.
దీంతో, అయ్యన్న దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపిన హైకోర్టు జగన్ కు షాకిచ్చింది. అయ్యన్న వ్యక్తిగత స్వేచ్ఛకు భంగం కలిగించొద్దంటూ ఏపీ పోలీసులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అకారణంగా పెద్ద సంఖ్యలో పోలీసులను అయ్యన్న ఇంటి వద్ద ఎందుకు మోహరిస్తున్నారని పోలీసులను ప్రశ్నించింది. అయ్యన్నపై కేసులు లేకున్నా బలగాల మోహరింపు ఎందుకని కోర్టు నిలదీసింది. దీంతో, అయ్యన్న విషయంలో జగన్ కు రెండోసారి చుక్కెదురైంది.
కాగా, ఆంధ్రా యూనివర్సిటీ పరువు తీసేలా వ్యాఖ్యలు చేశారంటూ అయ్యన్నపై కొద్ది రోజుల క్రితం మరో కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే, భయపెట్టి తన గొంతు నొక్కేందుకే ఇలా కేసులు పెడుతున్నారని అయ్యన్న ఫైర్ అయ్యారు. తనను అరెస్ట్ చేయాలంటే కేసు నమోదు చేసి, ఎఫ్ఐఆర్ కాపీ ఇవ్వాలని అన్నారు. నిబంధనలు పాటించకుండా ఇంటికొస్తే కోర్టుకెళ్తానని చెప్పారు.