ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశం అంటే.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ అంశమే. ఈ సంస్థ నష్టాల్లో ఉన్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం వంద శాతం పెట్టుబడులు ఉపసంహరించడానికి నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఫ్యాక్టరీని ప్రైవేటు పరం చేయడానికి వేగంగా అడుగులు పడుతుండటంతో సంస్థ ఉద్యోగులతో పాటు స్థానిక ప్రజానీకంలో ఆగ్రహావేశాలు పెల్లుబుకుతున్నాయి. స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను అడ్డుకునే విషయంలో అక్కడి ప్రధాన రాజకీయ పక్షాలు కలసికట్టుగా అడుగులు వేయట్లేదు. ఒకరి మీద ఒకరు నిందలేసుకుంటూ.. నెపాన్ని అవతలి వాళ్ల మీదికి నెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు.
కేంద్రం మాత్రం తమ నిర్ణయంలో ఎలాంటి మార్పూ ఉండదని సంకేతాలు పంపిస్తోంది. ఇలాంటి సమయంలో ఊహించని విధంగా తెలంగాణ మంత్రి కేటీఆర్ నుంచి ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి గట్టి మద్దతు లభించింది. ఆయన ఈ వ్యవహారంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా జరిగిన ఓ కార్యక్రమంలో కేటీఆర్ మాట్లాడుతూ.. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలని అనుకున్నపుడు పునర్విభజన చట్టంలో కేంద్రం ప్రస్తావించిన ఓ అంశాన్ని తెరపైకి తెచ్చారు.
తెలంగాణలో కూడా ఒక స్టీల్ ఫ్యాక్టరీ పెట్టి వేల మందికి ఉపాధి కల్పిస్తామని ఆ చట్టంలో పేర్కొన్నారని.. కానీ తీరా చూస్తే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో ముఖ్యమైన విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుకు అమ్మేస్తున్నారని ఆయన విమర్శించారు. ఒకప్పుడు విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అంటూ ఎంతోమంది శ్రమించి, ఎన్నో త్యాగాలు చేసి సాధించుకున్న ఫ్యాక్టరీ ఇదని.. దాన్నెలా ప్రైవేటు పరం చేస్తారని కేటీఆర్ ప్రశ్నించారు. ఈ ఉద్యమానికి నైతికంగా తమ మద్దతు పూర్తిగా ఉంటుందని.. అవసరమైతే కేసీఆర్ ఆశీర్వాదంతో తమ బృందం విశాఖకు వెళ్లి అక్కడ ఉద్యమం చేస్తున్న వారికి నేరుగా మద్దతు ప్రకటిస్తామని కేటీఆర్ అన్నారు. కేంద్ర ప్రభుత్వానికి అలుసు ఇస్తే.. రేప్పొద్దున రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అవసరం లేదని, చెప్పి ఇక్కడి పాలనను కూడా ప్రైవేటు పరం చేస్తాయంటూ ఆయన కౌంటర్ వేశారు.