టాలీవుడ్ హీరోల్లో శర్వానంద్ స్టైలే వేరు. కమర్షియల్ చిత్రాలతో పాటు ఫ్యామిలీ ఓరియంటెడ్ చిత్రాలు, సందేశాత్మక చిత్రాలు తీస్తు టాలీవుడ్ లో తనదైన ముద్ర వేస్తున్నాడు. ఈ క్రమంలోనే ఆధునిక వ్యవసాయం గురించి తెలిపేలా శర్వా తాజాగా శ్రీకారం అనే చిత్రంలో నటించాడు. సేద్యాన్ని ఆదాయ వనరుగా మార్చుకోవడం గురించి నిర్మించిన కమర్షియల్ చిత్రం ‘శ్రీకారం’ ఈ నెల 11న విడుదల కాబోతోంది.
శర్వానంద్, ప్రియాంక అరుళ్ మోహన్ జంటగా కిషోర్ బి దర్శకుడిగా తెరకెక్కిన ఈ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్ బ్యానర్‌పై రామ్ ఆచంట, గోపి ఆచంట నిర్మించారు. మహాశివరాత్రి సందర్భంగా మార్చి 11న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోన్న ఈ చిత్రం రెండో ప్రీ రిలీజ్ ఈవెంట్ వేడుక హైదరాబాద్ లో ఘనంగా జరిగింది. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా కట్టంగుర్, నల్గొండ రైతుల సంక్షేమం కోసం రూ.25 లక్షలను కేటీఆర్ కు ఎన్నారై వ్యాపారవేత్తలు శశికాంత్ వల్లేపల్లి, రామ్ బొబ్బా అందజేశారు. రైతులకు తమ వంతు సాయం చేశామని వారు చెప్పారు. రైతులకు భారీ విరాళమిచ్చిన వారిద్దరినీ కేటీఆర్ అభినందించారు. ఇటువంటి చిత్రాలను తప్పకుండా ఆదరించాలని కేటీఆర్ అన్నారు. హృదయంతో ఈ సినిమాను నిర్మించారని, శర్వానంద్ కూడా అంతే సింపుల్‌గా ఉన్నారని అన్నారు. ఎద్దు ఏడ్చిన ఎవుసం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదని, వ్యవసాయంలోనే వ్యయం ఉంది, సాయం ఉంది అని చెప్పారు.
ఇప్పుడు వ్యయం పెరిగింది.. సాయం తగ్గింది అని, రైతులు వ్యవసాయం చేసే పరిస్థితి లేదని తెలిపారు. మంచి ప్రయత్నాలు, మంచి సినిమాలు చేస్తూ ఉంటే ఎప్పుడూ అండగా ఉంటామన్న కేటీఆర్…ఈ సినిమాకు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్ మినహాయింపు ఇచ్చేందుకు ప్రయత్నిస్తానని అన్నారు. మంచి సినిమాలను ప్రేక్షకులు కూడా ఆదరించాలని, పైరసీ లేకుండా థియేటర్లోనే సినిమాను చూడాలని కోరారు.