అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు అమరావతి మహిళా రైతులకు ఘోర అవమానం జరిగిన సంగతి తెలిసిందే. కనకదుర్గమ్మను దర్శించుకునేందుకు పాదయాత్ర చేయాలన్న మహిళల సంకల్పాన్ని పోలీసులు భగ్నం చేయడం కలకలం రేపింది. మహిళా దినోత్సవం నాడే మహిళలను జగన్ ఘోరంగా అవమానించారని విమర్శలు వెల్లువెత్తాయి. మహిళల పట్ల కనీస మర్యాద చూపలేదని పలువురు మండిపడ్డారు.
ఒక మహిళ హోం మంత్రిగా ఉన్న రాష్ట్రంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం నాడు సాటి మహిళలకు ఘోర అవమానం జరగడంపై విమర్శలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఘటనపై టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు మండిపడ్డారు. ప్రకాశం బ్యారేజి వద్ద అమరావతి మహిళలపై జరిగిన దాడి అమానుషం అని చంద్రబాబు నిప్పులు చెరిగారు.
తమ హక్కుల కోసం పోరాడుతున్న మహిళలపై భౌతికదాడులు చేయడాన్ని ఖండించారు. తుళ్లూరు దీక్ష శిబిరాన్ని సందర్శించిన సందర్భంగా చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేశారు. నాడు రాజధాని కోసం భూములు త్యాగం చేసిన రైతులను అందరూ మెచ్చుకున్నారని గుర్తు చేశారు. అమరావతి రైతులతో ప్రభుత్వం తరఫున ఒప్పందం చేసుకున్నామని, అది మార్చుకోలేని ఒప్పందం అనీ చంద్రబాబు చెప్పారు.
ఆ విధమైన నిబంధన ఉండడం వల్లే రైతులు భూములు ఇచ్చారని గుర్తు చేశారు. వారి త్యాగం వల్లే అమరావతిలో ప్రపంచ స్థాయి రాజధాని నిర్మించాలని తాను తలపెట్టిన కార్యక్రమానికి జగన్ బ్రేకులు వేశారని మండిపడ్డారు. అమరావతి భూముల వ్యవహారంలో అక్రమాలు జరిగాయని ప్రచారం చేశారని, ఈ ప్రాంతంలో ఒకే కులం ఉందని దుష్ప్రచారం చేశారని దుయ్యబట్టారు.