షెడ్యూల్ ప్రకారం చూస్తే.. వచ్చే ఏడాది చివర్లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు జరగాల్సి ఉంటుంది. అయితే..ముందస్తు ఎన్నికలకు వెళ్లేందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఆసక్తిని చూపిస్తున్నారన్న ప్రచారం కొద్ది రోజులుగా వినిపిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ ఏడాది చివర్లో ప్రభుత్వాన్ని రద్దు చేసి ఎన్నికలకు వెళ్లే వీలుందన్న మాట వినిపిస్తున్నా.. ఇప్పుడున్న పరిస్థితుల్లో అలాంటి అవకాశాలు తక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఇదిలా ఉంటే.. ఎన్నికలకు ఏడాదికి పైనే అవకాశం ఉన్నప్పటికీ.. తెలంగాణలో ఎన్నికల వేడి రాజుకోవటమే కాదు.. ఎవరికి వారు వచ్చే ఎన్నికల్లో ఏ పార్టీకి ఏమేరకు అవకాశాలు ఉన్నాయన్న దానిపై పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.
ఇందులో భాగంగా పలువురు ఏ పార్టీకి ఎన్ని సీట్లు వచ్చే అవకాశం ఉంది? గెలుపు అవకాశాల మాటేమిటి? లాంటి లెక్కల్ని చెబుతున్నారు. ఇలాంటి వేళ తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ఆసక్తికర విషయాల్ని వెల్లడించారు.
తమకున్న అంచనాల ప్రకారం వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ కు కేవలం 15 సీట్లు మాత్రమే వస్తాయని.. తమ పార్టీకి 90 సీట్లు వచ్చి అధికారాన్ని చేపడతామన్న ధీమాను వ్యక్తం చేశారు.
వచ్చే లోక్ సభ ఎన్నికల నాటికి టీఆర్ఎస్ పార్టీనే ఉండదన్న ఆయన.. ఆ పార్టీకి వచ్చే సీట్ల లెక్కే అవసరం లేదని వ్యాఖ్యానించటం గమనార్హం. వచ్చే లోక్ సభ ఎన్నికల్లో బీజేపీకి 12 ఎంపీ సీట్లు ఖాయమని..హైదరాబాద్ ఎంపీ స్థానంలోనూ తాము గెలుస్తామన్న ధీమాను వ్యక్తం చేయటం విశేషం.
పాతబస్తీ సంగతి చూస్తామని.. ఇది పక్కా అని వ్యాఖ్యానించిన బండి.. ‘మలక్ పేట.. కార్వాన్.. చాంద్రాయణగుట్ట.. గోషామహల్ లో మాకు మంచి పట్టు ఉంది. ఇక ఎంపీ స్థానం ఎందుకు గెలవలేం? యూపీలో ముస్లిం జనాభా ఎక్కువగా ఉన్న అజంగఢ్ నే బీజేపీ విజయం సాధించినప్పుడు ఇక్కడెందుకు సాధ్యం కాదు?’’ అని ప్రశ్నించారు.
మజ్లిస్ ను భరించే ఓపిక తమకు లేదని ముస్లింలే అంటున్నారని.. బీజేపీయే కావాలని ముస్లిం మహిళలు కోరుకుంటున్నారన్నారు. బీజేపీకి అభ్యర్థులు లేరన్న వాదనను కొట్టిపారేశారు. ఎన్టీఆర్ టీడీపీ పెట్టినప్పుడు అభ్యర్థులు ఎవరు? కేసీఆర్ టీఆర్ఎస్ పెట్టినప్పుడు అభ్యర్థులు ఎవరు? అయినా.. ఆ పార్టీలు అధికారంలోకి వచ్చాయి కదా? అంటూ బండి వ్యాఖ్యానించారు.
మొత్తానికి టీఆర్ఎస్ పని అయిపోయిందన్నట్లుగా చెబుతున్న బండి కాన్ఫిడెన్స్ బాగానే ఉన్నా.. గ్రౌండ్ లెవెల్ లో టీఆర్ఎస్ పరిస్థితి అంత దయనీయంగా లేదన్న విషయాన్ని మాత్రం చెప్పక తప్పదు.