కేసినో డాన్ చికోటి ప్రవీణ్ వ్యవహారం ఇపుడు దేశవ్యాప్తంగా ప్రకంపనలు రేపుతోంది. ప్రవీణ్ క్యాసినోతో ఏపీ, తెలంగాణకు చెందిన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులు, రాజకీయ ప్రముఖుులకు సంబంధాలున్నాయన్న పుకార్లు వినిపిస్తున్నాయి. చికోటి ప్రవీణ్ గురించి తాము అప్పుడే చెప్పామని.. ఎమ్మెల్యే కొడాలి నానికి ప్రవీణ్ తో సాన్నిహిత్యం ఉందని, దీనిపై ఫిర్యాదు చేసినా పోలీసులు పట్టించుకోలేదని టీడీపీ నేతలు చెప్పారు.
ముఖ్యంగా గుడివాడలో మాజీ మంత్రి గతంలో నిర్వహించిన క్యాసినోకు కేరళ నుంచి కూడా పెద్ద పెద్ద వారు వచ్చారని ఆరోపించారు. క్యాసినోకు ఎంట్రీ ఫీజుగా రూ.10 వేలు వసూలు చేశారని.. 18వేల మంది ఇందులో పాల్గొనడంతో.. ఎంట్రీ ఫీజు రూపంలోనే రూ.180 కోట్లు ఆర్జించారని టీడీపీ నేతల ఆరోపిస్తున్నారు. కొడాలినానికి చికోటి ప్రవీన్ కు సంబంధాలున్నాయని అంటున్నారు. ఈ క్రమంలోనే క్యాసినో వ్యవహారంపై కొడాలి నాని స్పందించారు.
దమ్ముంటే తనను ఈడీతో అరెస్ట్ చేయించాలని టీడీపీ నేతలకు కొడాలి నాని సవాల్ విసిరారు. క్యాసినో పై టీడీపీ నిజనిర్ధారణ కమిటీ నివేదికను ఈడీకి ఇవ్వాలని నాని ఛాలెంజ్ చేశారు. దేశంలో ఏం జరిగినా తనకు, జగన్ కు ముడి పెడుతున్నారని అన్నారు. చికోటి ప్రవీణ్ వ్యవహారాన్ని తమకు ఆపాదించడం సరికాదని అన్నారు.
మరోవైపు, క్యాసినో వ్యవహారంలో కీలక సూత్రదారులు చికోటి ప్రవీణ్, మాధవరెడ్డిలకు ఈడీ అధికారులు నోటీసులు జారీ చేశారు. సోమవారం ఈడీ కార్యాలయానికి విచారణకు రావాలని అందులో పేర్కొన్నారు. ఐఎస్ సదన్‌లోని చికోటి ప్రవీణ్ ఇంట్లో అధికారులు బుధవారం ఉదయం నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సోదాలు నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు ప్రముఖులు, సెలబ్రిటీలతో ప్రవీణ్‌కు సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు.ఈ సందర్భంగా ప్రవీణ్ ల్యాప్‌టాప్, మొబైల్ స్వాధీనం చేసుకున్నారు. అయితే, గోవాలో క్యాసినో చట్టబద్ధమని, ఈడీ అధికారులకు సహకరిస్తానని అంటున్నారు.
Comments 1