‘‘ప్రధాన మంత్రి మోదీ అపాయింట్మెంట్ అడిగా. నేను చూసిన పరిస్థితులన్నింటినీ ఆయనకు వివరిస్తా. 1986లో ఇంత స్థాయి నీరు వచ్చిందని, మళ్లీ 36 ఏళ్ల తర్వాత ఆ స్థాయిలో నీళ్లు వచ్చాయని చెబుతా. ఇది జాతీయ ప్రాజెక్టు. అందువల్ల ఏరోజైనా పరిహారం ఇవ్వక తప్పదు కదా సర్.. ఇచ్చేదేదో ఇప్పుడే ఇస్తే.. వారంతా సంతోషిస్తారు. నిర్వాసితులు మిమ్మల్నే తలుచుకుంటారు.. లేదంటే తిట్టుకుంటారు.. బటన్ నొక్కి డీబీటీ ద్వారా నేరుగా నిర్వాసితుల ఖాతాల్లోకి మీరే డబ్బు పంపండి అని ప్రధాన మంత్రిని కోరుతా’’ వరద బాధితులు, పోలవరం నిర్వాసితులతో సీఎం జగన్ చెప్పిన మాటలివి.
ఇప్పటికే బటన్ సీఎం అని పేరున్న జగన్ …తాజాగా మరోసారి మోదీతో బటన్ నొక్కించి డీబీటీ ద్వారా నేరుగా నిర్వాసితుల ఖాతాల్లో డబ్బు జమ చేస్తాననడం చర్చనీయాంశమైంది. పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించాలని తనకున్నప్పటికీ…కేంద్రమే ఇవ్వడం లేదని మోదీపై తప్పుని నెట్టేశారు జగన్. ఇంకా చెప్పాలంటే, కేంద్రమే డబ్బులు ప్రింట్ చేస్తోందని, కేంద్రం దగ్గర డబ్బులు లేకపోవడం ఏమిటని జనం ముందు ఆశ్చర్యపోయిన జగన్..ఆ మాటలతో తన అపరిపక్వతను బయటపెట్టుకొని మనందరినీ ఆశ్చర్యపరిచారు.
ప్రత్యేక హోదా వస్తే ఐటీ కట్టాల్సిన పని లేదని, జగన్ గతంలో పదే పదే చెప్పడంపై కూడా ట్రోలింగ్ జరిగింది. ఇక, ఇప్పుడు డబ్బులు కేంద్రమే ప్రింట్ చేస్తోందంటూ జగన్ నోటి నుంచి జాలువారిన మరో ఆణిముత్యంపై కూడా ట్రోలింగ్ మొదలైంది. డబ్బులు ప్రింట్ చేసినంత మాత్రాన కేంద్రం దగ్గర డబ్బులున్నట్లు కాదన్న సంగతి కూడా తెలియకుండా జగన్ సీఎం ఎలా అయ్యారంటూ నెటిజన్లు దుమ్మెత్తిపోస్తున్నారు.
డబ్బులు ప్రింట్ చేసుకునే హక్కు రాష్ట్రానికి…ఇంకా చెప్పాలంటే జగన్ చేతికిస్తే ఏపీకి ఉన్న అప్పులన్నీ నెల రోజుల్లో తీర్చేస్తారని సెటైర్లు వేస్తున్నారు. జగన్ ఆలోచనా స్థాయి…అవగాహన అంతేనా అని నివ్వెరపోతున్నారు. ప్రింటర్ లో ప్రింట్ చేస్తే బయటికొచ్చే కాస్ట్లీ పేపరే కరెన్సీ అని టెన్త్ ఫెయిల్ స్టూడెంట్స్ అనుకుంటుంటారని, ఆ రేంజ్ లో జగన్ మాట్లాడడం ఏమిటని సెటైర్లు వేస్తున్నారు. ఇలా ఇష్టమొచ్చినట్లు డబ్బులు ప్రింట్ చేసే వెనిజులా, శ్రీలంక, సోమాలియా వంటి దేశాలు ఆర్థికంగా కుప్పకూలిపోయాయని, జగన్ వాలకం చూస్తుంటే ఆ లిస్ట్ లో ఏపీని కూడా చేర్చేలా కనిపిస్తున్నారని విమర్శిస్తున్నారు.
అందుకే, రాసిచ్చిన స్క్రిప్ట్ లు కళ్ల ముందు లేకుంటే జగనన్న నోటి నుంచి మరెన్నో ఆణిముత్యాలు రాలతాయని, జగన్ అజ్ఞానాన్ని జనానికి తెలియజేస్తుంటాయని అంటున్నారు. అయితే, ప్రజల ముందు మోదీనే విలన్ అని చెప్పడానికి జగన్ ఇలా మాట్లాడారని, ఆ ప్రాంత ప్రజలకు డబ్బులు కేంద్రం ప్రింట్ చేస్తుందని చెబితేనే కేంద్రం ఏపీకి డబ్బులివ్వడం లేదన్న విషయం అర్థమవుతుందని జగన్ అభిమానులు సమర్థించుకుంటున్నారు.
Comments 1