భారీ మల్టీలెవల్ మార్కెటింగ్ మోసాన్ని చేధించారు సైబరాబాద్ కమిషనరేట్ పోలీసులు. తమ ఉత్పత్తుల్ని వాడితే ఆరోగ్యవంతులుగా మారటమే కాదు.. లావుగా ఉన్న వారు సన్నబడతారని.. నల్లగా ఉన్న వారు తెల్లగా మారతారంటూ అబద్ధపు ప్రచారంతో వేలాది కోట్లు మోసం చేసిన వైనం షాకింగ్ గా మారింది.
దేశవ్యాప్తంగా 10 లక్షల మందిని మోసపుచ్చి.. రూ.1500 కోట్ల వరకు కుచ్చుటోపీ పెట్టిన వైనం సైబరాబాద్ సీపీ సజ్జన్నార్ వెల్లడించారు. బెంగళూరు కేంద్రంగా సాగిన మల్టీ లెవల్ మార్కెటింగ్ ఆట గురించి తెలిస్తే అవాక్కు అవ్వాల్సిందే.
బెంగళూరుకు చెందిన అభిలాష థామస్ గతంలో మల్టీలెవల్ మార్కెటింగ్ కంపెనీలో పని చేసిన అనుభవం ఉంది. దీంతో.. 2014లో నలుగురు మిత్రులతో కలిపి ఇండస్ వివా హెల్త్ సైన్స్ ప్రైవేట్ లిమిటెడ్ పేరుతో ఒక కంపెనీని ప్రారంభించారు. పలు హెల్త్ ఉత్పత్తులను ప్రచారం చేస్తూ.. తమ కంపెనీలో రూ.12500 సభ్యత్వం కడితే మెంబర్లుగా మారతారని.. భర్త కడితేభార్య.. భార్య కడితే భర్త కూడా సభ్యులవుతారని ప్రచారం చేస్తారు.
అనంతరం అలా చేరిన వారు వారంలో మరో ఇద్దరిని చేర్పిస్తే.. మొదటి వ్యక్తికి రూ.1000 కమిషన్ వస్తుంది. ఆ ఇద్దరు మరో ఇద్దరిని.. ఆ నలుగురు మరో నలుగురిని ఇలా 9స్థాయిల్లో స్కీం సాగుతుంది. తొమ్మిది వారాల్లో ఒక వ్యక్తి ద్వారా 256 మంది సభ్యులు చేరితే అతడికి ర.2.56 లక్షల కమిషన్ వస్తుంది.
ఇలా.. ఎంతమందిని చేరిస్తే అంత డబ్బులు కమిషన్ రూపంలో అందుతుంది. తెలంగాణకు చెందిన ప్రభుత్వ ఉపాధ్యాయులు తమ ఉద్యోగానికి సెలవు పెట్టి.. దీన్నే ఫుల్ టైం జాబ్ గా మార్చుకొని నెలకు రూ.10లక్షలు దాకా సంపాదిస్తున్నట్లు సజ్జన్నార్ చెప్పారు. తాజాగా వీరిని అదుపులోకి తీసుకున్నారు. వారి భార్యల్ని అరెస్టు చేశారు.
ఇండస్ వివా మోసంలో తెలుగు రాష్ట్రాలకు చెందిన వారు లక్షల సంఖ్యలో ఉన్నట్లు చెబుతన్నారు. దాదాపుగా 10 లక్ష లమంది నుంచి రూ.1500 కోట్ల వరకు వసూలు చేసినట్లుగా తెలుస్తోంది. హైదరాబాద్ లోని ఒక ఫైవ్ స్టార్ హోటల్ లో సదరు కంపెనీకి చెందిన ప్రోగ్రాం జరుగుతుందని తెలుసుకున్న సైబరాబాద్ పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.
కంపెనీకి చెందిన బ్యాంకు ఖాతాల్లో ఉన్న రూ.20కోట్లను సీజ్ చేశారు. మిగిలిన రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో ఎక్కువ మంది మార్కెటింగ్ డిస్ట్రిబ్యూటర్లు ఉన్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. ఇలాంటి మోసాలకు గురయ్యే వారికి శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరిస్తున్నారు.