మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తు సినిమా థ్రిల్లర్ ను తలపిస్తోన్న సంగతి తెలిసిందే. వివేకా వద్ద కారు డ్రైవర్గా పనిచేసిన దస్తగిరి అప్రువర్ గా మారి రెండుసార్లు వాంగ్మూలం ఇవ్వడంతో ఈ కేసులో సీబీఐ కొద్ది రోజుల క్రితం దూకుడు పెంచింది. అయితే, సీబీఐ ఎస్పీ రాంసింగ్ తనను బెదిరిస్తున్నారని ఉదయ్ కుమార్ రెడ్డి అనే అనుమానితుడు ఫిర్యాదు చేయడం, దాంతో రాంసింగ్ పై కేసు నమోదు చేయడం సంచలనం రేపింది.
ఈ సంచలన కేసును దర్యాప్తు చేస్తున్న కీలక అధికారిపైనే ఆరోపణలు రావడం, కేసు పెట్టడం హాట్ టాపిక్ అయింది. ఎంపీ అవినాష్ రెడ్డికి సన్నిహితుడిగా పేరున్న ఉదయ్ ఫిర్యాదుపై వెంటనే యాక్షన్ తీసుకోవడం సంచలనం రేపింది. అవినాష్ రెడ్డి పేరు బయటకు వస్తుందన్న కారణంతోనే రాంసింగ్ పై కేసు పెట్టారని ఆరోపణలు వచ్చాయి. ఆ తర్వాత ఈ కేసులో మొట్టమొదటిగా అరెస్ట్ అయిన ఎర్ర గంగిరెడ్డికి సెషన్స్ కోర్టు బెయిల్ ఇచ్చింది.
అయితే, దానిని సీబీఐ అధికారులు హైకోర్టులో సవాల్ చేశారు. కానీ, అక్కడ కూడా వారికి సానుకూల ఫలితం రాలేదు. దీంతో, ఈ కేసు విచారణలో సీబీఐ కాస్త నెమ్మదించింది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఎర్రగంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలంటూ సుప్రీం కోర్టును సీబీఐ ఆశ్రయించడం సంచలనం రేపుతోంది. ఇంతకాలం సైలెంట్ గా ఉన్న సీబీఐ హఠాత్తుగా సుప్రీంకోర్టు తలుపు తట్టడం ఆసక్తికరంగా మారింది.
ఎర్రగంగిరెడ్డి ఇంట్లో వివేకా హత్యకు స్కెచ్ వేశారని, అందుకే ఈ కేసులో ఆయన ఏ1గా ఉన్నారని సీబీఐ చెబుతోంది. అందుకేు, వివేకా హత్య కేసులో దాఖలైన ఛార్జిషీటులోనూ గంగిరెడ్డిని ఏ1గా సీబీఐ చేర్చింది. అటువంటి గంగిరెడ్డి బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారని సుప్రీంకోర్టుకు దాఖలు చేసిన పిటిషన్లో సీబీఐ పేర్కొంది. సీబీఐ పిటిషన్పై త్వరలో సుప్రీంలో విచారణ జరుగనుంది.
Comments 1