గ్రామ, వార్డు వాలంటీర్లపై మంత్రి ధర్మాన ప్రసాదరావు షాకింగ్ కామెంట్లు చేశారు. ప్రభుత్వానికి ఎసరు పెట్టే వాలంటీర్లను తప్పించాలంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘గడప గడపకు మన ప్రభుత్వం’ కార్యక్రమంలో పాల్గొన్న ధర్మాన…కొందరు వాలంటీర్లు టీడీపీకి సపోర్టు చేస్తున్నారని ఆరోపించారు. అంతేకాదు, తమకు ఎసరు పెట్టే వాలంటీర్లను చూస్తూ ఊరుకునేది లేదంటూ వార్నింగ్ ఇచ్చారు.
టీడీపీకి సపోర్ట్ చేసే వాలంటీర్లు స్వచ్ఛందంగా రాజీనామా చేయాలంటూ హుకుం జారీ చేశారు. ఒకవేళ వారు రాజీనామా చేయకుంటే తామే తీసేస్తామని కూడా హెచ్చరించారు. తాము కిరీటం పెట్టిన వాలంటీర్లు ప్రభుత్వానికి ఎసరు పెడుతున్నారని ఆరోపించారు.అబద్దాలు చెప్పి తిరగటం ఎందుకు బయటికి వెళ్లి టీడీపీకి ప్రచారం చేసుకోండి అంటూ ధర్మాన ప్రసాదరావు ఉచిత సలహా ఇచ్చారు.
పని చేయడం చేతగాకపోతే స్వచ్ఛందంగా తప్పుకోవాలని, 50 కుటుంబాలకు సేవ చేయలేని వాలంటీర్లు అవసరం లేదని సంచలన వ్యాఖ్యలు చేశారు.వాలంటీర్లు తప్పనిసరిగా ఆ 50 కుటుంబాల భాద్యత తీసుకోవాల్సిందేనని, రాష్ట్రంలోని ప్రతీ సచివాలయానికి రూ.20 లక్షలు ఇస్తున్నామని అన్నారు. ఇంజినీరింగ్ సిబ్బంది బాధ్యతతో పనులు వేగవంతం చేయాలని, కాంట్రాక్టర్లను ఏదో రకంగా భయపెట్టకపోతే పనులు జరగవని సంచలన వ్యాఖ్యలు చేశారు.
అవసరమైతే కొద్ది మంది కాంట్రాక్టర్లను బ్లాక్ లిస్ట్‌లో పెట్టాలని, గతంలో మాదిరిగా భారీస్థాయిలో లాభాలు రావాలంటే కుదరదని అన్నారు. దీంతో, వాలంటీర్లు, కాంట్రాక్టర్లపై ధర్మాన చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. వాలంటీర్లకు కూడా పార్టీ ముద్ర వేసిన ధర్మానను నెటిజన్లు విమర్శిస్తున్నారు.
cqeACOIBiYUNXx