ఒక్క డిసెంబరులోనే 2,300 కోట్ల మద్యం తాగించారు
లిక్కర్ అమ్మకాల్లో ఆల్‌టైమ్ రికార్డు
న్యూఇయర్ కిక్ రూ.100 కోట్లు
నవ్యాంధ్రలో దశలవారీ మద్యనిషేధం కలలో మాటే! సంపూర్ణ మద్యపానం నడుస్తోందని దాని అమ్మకాలే చాటుతున్నాయి. ‘మద్యం ధరలు పేదలకు అందనంత ఎత్తులో ఉండాలి. అప్పుడే పేదలు మద్యం జోలికి వెళ్లరు. వారి కుటుంబాలు బాగుపడతాయి. జీవన విధానం మెరుగుపడుతుంది’’ ..జగన్ సీఎం అయిననాటినుంచి చెబుతున్న మాట. అన్నట్లుగానే నిరుడు మే నెలలో మద్యం ధరలు భారీగా పెంచేశారు. పక్క రాష్ర్టాలతో పోలిస్తే రెట్టింపు చేశారు. దీంతో రాష్ట్రంలో అమ్మకాలు భారీగా తగ్గిపోయాయి.
కానీ సరిగ్గా ఆరు నెలలు తిరగకముందే సీన్ రివర్స్ అయింది. రకరకాల కారణాలు చెబుతూ సెప్టెంబరులో చీప్ లిక్కర్ ధరలు భారీగా తగ్గించేశారు. అదే సమయంలో మీడియం, ప్రీమియం బ్రాండ్ల ధరలు ఇంకొంత పెంచారు. ఏమైందో ఏమోగానీ రెండు నెలలు కూడా గడవకముందే ఆ పెంచిన బ్రాండ్ల ధరలను మొదటికి తీసుకొచ్చేశారు. దీంతో మొత్తంగా చూస్తే మే నెలలో మద్యం ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా దాదాపుగా అదే స్థాయికి వచ్చేశాయి. ఒక్కో క్వార్టర్ సీసాపై రూ.100 నుంచి రూ.250 వరకు, ఫుల్‌పై రూ.400 నుంచి రూ.వెయ్యి తగ్గింది.
ముందస్తు ఆలోచన లేకుండా ఇష్టానుసారంగా ధరలు పెంచిన ప్రభుత్వం దానిపై వెనుకడుగు వేయక తప్పని పరిస్థితి ఏర్పడింది. మద్యం ధరలపై ఒక అడుగు ముందుకు, మరో అడుగు వెనక్కి తప్ప.. ఇప్పటివరకూ స్థిరంగా నిషేధం కోసం తీసుకున్న నిర్ణయం కనిపించడం లేదు. మద్యం తాగేవారిని మార్చుతామని ఆర్భాటంగా ప్రకటించింది. అది వట్టి మాటేనని గత డిసెంబరు నెలలో జరిగిన అమ్మకాలు చాటుతున్నాయి.
ఏడాదిలో ఖజానాకు రూ.13 వేల కోట్లు
కరోనా, లాక్డౌన్, ఆర్థిక తిరోగమనం లాంటి పదాలు వేరే ఏదైనా రంగానికి వర్తిస్తాయేమో గానీ, మద్యానికి ఇలాంటివేమీ పనిచేయవు. దశలవారీ మద్యనిషేధం అంటూ ప్రభుత్వం ఊదరగొట్టినా వాటిని మందుబాబులు లెక్కచేయలేదు. షాపుల సంఖ్య తగ్గించినా, మద్యం అమ్మకాలపై అనేక ఆంక్షలు విధించినా అవి లిక్కర్ అమ్మకాలను నియంత్రించలేకపోయాయి. ఎప్పుడూ లేనంతగా ఒక్క డిసెంబరు నెలలోనే ఏకంగా రూ.2,300 కోట్ల మద్యం అమ్మకాలతో ఎక్సైజ్‌లో కొత్త రికార్డు నమోదైంది.
ఇప్పటివరకూ ఏ నెలలోనూ అమ్మకాలు రూ.2 వేల కోట్లు దాటలేదు. ప్రతి నెలా సగటున రూ.1,800 కోట్ల అమ్మకాలే నమోదవుతున్నాయి. కానీ డిసెంబరులో ఒకేసారి దాదాపు రూ.500 కోట్ల మేర అమ్మకాలు పెరగడం యంత్రాంగానికి సైతం ఊహకందని విషయమే. ఆ నెలలో 22,10,592 కేసుల లిక్కర్, 6,68,106 కేసుల బీరు అమ్ముడైంది. రోజుకు రూ.68 కోట్లకుపైగా వ్యాపారం జరిగింది. దీంతో ఈ ఏడాది ఎక్సైజ్ ద్వారా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.13వేల కోట్లు దాటింది.
లాక్డౌన్ కారణంగా ఈ ఆర్థిక సంవత్సరం మొదటి నెల ఏప్రిల్‌లో అమ్మకాలు ఏమీ లేవనేది గుర్తు చేసుకొంటే…ఈ స్థాయిలో ఆదాయం రావడం అనూహ్యమే. గతేడాది ఈ సమయానికి రూ.15 వేల కోట్ల ఆదాయం వచ్చింది. సగటున చూస్తే నెల రోజులు పూర్తిగా అమ్మకాలు లేకపోయినా ఈ స్థాయిలో ఆదాయం రావడం గతేడాది అమ్మకాల కంటే ఎక్కువగానే ఉంది. మిగిలిన మూడు నెలల్లో మరో ఏడు వేల కోట్ల వరకు ఆదాయం రావొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. మొత్తం 2020-21 ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మద్యం ద్వారా రూ.20 వేల కోట్లు ప్రభుత్వానికి సమకూరే అవకాశం ఉంది.
రెండు విధాలా లాభమే..
మద్య నిషేధం నినాదంతో అమ్మకాలను తన అధీనంలోకి తీసుకున్న వైసీపీ సర్కారు.. కర్ర విరగకూడదు, పాము చావకూడదు అన్నతరహాలో పక్కా ప్రణాళికను అమలుచేస్తోంది. మద్యం ధరలు పెంచడం ద్వారా గతంతో పోలిస్తే పరిమాణపరంగా స్వల్పంగా అమ్మకాలు తగ్గాయి. కానీ ధరలు పెరగడం వల్ల ఖజానాకు ఏమాత్రం ఢోకా లేకుండా గతంలో కంటే ఎక్కువ ఆదాయం వస్తోంది. అటు అమ్మకాలు కొంతైనా తగ్గించామన్న పేరు.. ఇటు ఖజానాకు లోటు లేకుండా ఆదాయం రెండూ ఏకకాలంలో వస్తున్నాయి. ప్రభుత్వానికి వీలైనంత ఆదాయం తెచ్చిపెట్టేందుకు ఎక్సైజ్‌శాఖ కూడా తన వంతు కృషి చేస్తోంది.
ప్రైవేటు చేతుల్లో ఉన్న మద్యం అమ్మకాలను ప్రభుత్వం చేతిలోకి తీసుకుని అనేక నిబంధనలు అమల్లోకి తెచ్చినప్పటికీ అవి అమ్మకాలు తగ్గించేందుకు పనిచేయలేదు. గతంలో 4,300 షాపులుంటే వైసీపీ ప్రభుత్వం 2,900కి తగ్గించింది. షాపుల పనివేళలను కూడా ఉదయం గంట, రాత్రి రెండు గంటలు తగ్గించింది. అలాగే షాపుల వద్ద నిలబడి తాగేందుకు ఉన్న పర్మిట్ రూమ్‌లను రద్దుచేసింది. ఈ చర్యలతో కచ్చితంగా అమ్మకాలు తగ్గుతాయని భావించగా, ఏమాత్రం ఫలితం కనిపించడం లేదు. కేవలం ధరలు పెంచడం ఒక్కటే కొంతకాలం అమ్మకాలు తగ్గేలా చేసింది. అయితే దానివల్ల భారీగా ఆదాయం నష్టపోతున్నామని తెలుసుకున్న ప్రభుత్వం.. వెనకితగ్గింది. దీంతో గత రెండు నెలల నుంచి అమ్మకాలు జోరందుకున్నాయి.
మళ్లీ పాత బ్రాండ్లు..ఊరూపేరు లేని కొత్త బ్రాండ్లను తీసుకొచ్చిన వైసీపీ ప్రభుత్వం దానిపైనా క్రమంగా వెనక్కి తగ్గుతోంది. కొత్త బ్రాండ్లపై వినియోగదారులు అంతగా ఆసక్తి చూపడం లేదు. ఎంత నిఘా పెట్టినా పక్క రాష్ర్టాల నుంచి అక్రమ మద్యం వస్తూనే ఉంది. దానివల్ల రాష్ర్టానికి వచ్చే ఆదాయానికి గండి పడుతోంది. ఇది గమనించిన ప్రభుత్వం తాజాగా పాత బీర్లను మార్కెట్లోకి తీసుకొచ్చింది.
మొన్నటివరకూ పాత బ్రాండ్లన్నీ కనిపించకుండా చేసిన ఆ శాఖ, తాజాగా అన్ని రకాల బ్రాండ్లు షాపుల్లో ఉంచుతోంది. నూతన సంవత్సరం, సంక్రాంతి, వేసవికాలాలను దృష్టిలో పెట్టుకుని పాపులర్ బ్రాండ్లకు అనుమతిచ్చింది. మొన్నవరకూ ఒక్కసీసా కనిపించకుండా పోయిన కింగ్ఫిషర్కు తాజాగా 50వేల కేసుల ఆర్డర్ వెళ్లింది. దీంతో అమ్మకాలు మరింత పెరగనున్నాయి.
కొత్త సంవత్సరం రోజున..
నూతన సంవత్సరం ఎక్సైజ్‌కు మంచి కిక్ ఇచ్చింది. ప్రతి ఏటా తరహాలోనే ఈ డిసెంబరు 31న కూడా మద్యం షాపులు, బార్లు కిక్కిరిసిపోయాయి. కరోనా వల్ల ఈ ఏడాది అంతగా న్యూఇయర్ అమ్మకాలు ఉండకపోవచ్చేమోనని సందేహాలు వ్యక్తమైనా వాటిని పటాపంచలు చేస్తూ వినియోగదారులు ఆ ఒక్కరోజే రూ.88 కోట్ల మద్యం తాగేశారు. అంతకుముందు రోజు కూడా చాలా మంది మందు కొనుక్కుని నిల్వ చేసుకున్నారు. ఒక్కరోజే ఏకంగా రూ.112 కోట్ల మద్యం అమ్ముడైంది. సగటున రెండు రోజుల్లో రూ.వంద కోట్ల చొప్పున మద్యం విక్రయాలు జరిగాయి. రాష్ట్రంలో రోజుకు సగటున రూ.70 కోట్ల మందు అమ్ముతుండగా దానికి ఇది రూ.30 కోట్లు అదనం.