ఫ్లైట్ లో పిల్లి. వినేందుకే విచిత్రంగా అనిపించే ఈ ఉదంతం కటార్ కు వెళుతున్న ఒక విమానంలో చోటు చేసుకుంది. ఈ పిల్లి చేసిన రచ్చకు అత్యవసరంగా విమానాన్ని ల్యాండ్ చేయాల్సిన పరిస్థితి. ఇంతకూ పిల్లి ఏమిటి? విమానంలోని కాక్ పిట్ లోకి ఎలా వెళ్లిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. ఇంతకూ ఈ ఉదంతం ఎక్కడ చోటు చేసుకుంది? అన్న విషయంలోకి వెళితే..
సూడాన్ రాజధాని ఖార్టూమ్ నుంచి కటార్ వైపుకు టర్కో ఏవియేషన్ కు చెందిన ఒక విమానం బయలుదేరింది. టేకాఫ్ తీసుకొని కొంతదూరం ప్రయాణించిన తర్వాత.. కాక్ పిట్ లో పిల్లి ఉందన్న విషయాన్ని గుర్తించారు సిబ్బంది. దీంతో.. ఆ పిల్లిని పట్టుకునేందుకు కాక్ పిట్ లోని వారు ప్రయత్నం చేశారు. ఈ సందర్భంగా పైలెట్ మీద ఆ పిల్లి దాడి చేసింది.
అనుకోనిరీతిలో విమానంలోకి పిల్లి ఎంట్రీ ఇవ్వటం.. అది కాస్తా కాక్ పిట్ లోకి చేరటం.. అక్కడి కొత్త వాతావరణాన్ని చూసి భయానికి గురైన పిల్లి.. తనను పట్టుకునేందుకు ప్రయత్నిస్తునన వారిపై దాడి చేసింది. ఈ క్రమంలో పైలెట్ కు గాయాలయ్యాయి. దీంతో టేకాఫ్ అయిన అరంగటకే.. విమానాన్ని అత్యవసరంగా ఖార్టూన్ ఎయిర్ పోర్టులో దించేశారు. ఇంతకూ విమానంలోకి పిల్లి ఎలా వెళ్లిందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.
మెయింటెనెన్స్ కోసం ఎయిర్ పోర్టులో విమానాన్ని ఉంచిన వేళలో లోపలకు వెళ్లి ఉంటుందని భావిస్తున్నారు. విమానాన్ని శుభ్రం చేసే సిబ్బంది సరిగా గుర్తించకపోవటంతో.. అది కాస్తా కాక్ పిట్ లోనే ఉండిపోయింది. విమానం బయలుదేరిన తర్వాత దాన్ని గుర్తించి.. పట్టుకునే ప్రయత్నం చేశారు. దీంతో.. బెదిరిపోయిన పిల్లి దాడి చేసి ఉంటారని చెబుతున్నారు. అయితే.. ఇలాంటి ఉదంతాలు అప్పుడప్పుడు చోటు చేసుకుంటాయని.. కాకుంటే చాలా అరుదుగా అలాంటివి జరుగుతుంటాయని చెప్పక తప్పదు.