శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గ వైసీపీ నేతల పంచాయితీ తాడేపల్లి ప్యాలస్‌కు చేరింది. హిందూపురం వైసీపీలోని అసంతృప్త నేతలతో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాజాగా సచివాలయం లో సమావేశమయ్యారు. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ ఇంచార్జ్‌గా ఎమ్మెల్సీ ఇక్బాల్ ఉన్నారు. అయితే.. ఆయనకు స్థానిక నాయకులకు పడడం లేదు. దీంతో ఇక్బాల్ తమపై పెత్తనం చెలాయిస్తున్నారని.., ఇక్బాల్‌ను తక్షణమే అక్కడ తొలగించాలని.. ఆయననే ఉంచితే.. తాము పనిచేసేది లేదని వ్యతిరేక వర్గ నేతలు నవీన్ నిశ్చల్, అబ్దుల్ గనీ తేల్చి చెప్పారు.
మహ్మద్ ఇక్బాల్ ఇటీవల కాలంలో దూకుడు ప్రదర్శిస్తున్నారు. పొలీసు డిపార్ట్మెంట్ లో డీఎస్పీగా పనిచేసి రిటైరైన ఆయన ఇక్కడ చక్రం తిప్పుతున్నారనే వాదన ఉంది. దీంతో ఆయనకు వ్యతిరేక వర్గం పెరిగిపోయింది. ఆది నుంచి పార్టీని ఇక్కడ డెవలప్ చేసిన నవీన్ నిశ్చల్ మధ్య విభేదాలు ఉన్న విషయం తెలిసిందే. చాలా కాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న విభేదాలు.. గత కొంతకాలంగా బహిరంగంగానే బయటపడుతున్నాయి.
ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న వైసీపీ అధిష్టానం.. అసంతృప్త నేతలతో చర్చించే బాధ్యతను మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి అప్పగించింది. అయితే.. పెద్దిరెడ్డి సమక్షంలోనే ఇరువర్గాల నేతలు పరస్పరం వాగ్వాదానికి దిగినట్లు సమాచారం. ఇక్బాల్ వల్ల తాము చాలా ఇబ్బందులు పడుతున్నట్లు నవీన్, అబ్దుల్ గనీలు పెద్దిరెడ్డికి ఫిర్యాదు చేశారు. స్థానికేతరుడైన ఇక్బాల్‌కు హిందూపురం టికెట్ ఇవ్వొద్దని వారు కోరారు.
ఇక్బాల్ తమపై పెత్తనం చెలాయిస్తున్నారని.. దీన్ని సహించేది లేదని నేతలు స్పష్టం చేశారు. ఇక్బాల్ కాకుండా ఎవరిని ఇంఛార్జ్‌గా ఉంచినా పర్వాలేదని, ఇక్బాల్‌కు ఇస్తే తాము పనిచేసేది లేదని నవీన్ నిశ్చల్, అబ్దుల్ గనీ సహా ఇతర నేతలు తేల్చి చెప్పారు. అయితే..అక్కడే ఉన్న ఇక్బాల్.. సీఎం జగన్ ఆదేశిస్తే నియోజక వర్గాన్ని వదలి వెళ్లేందుకు సిద్దమని అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. వివాదం సద్దుమణగకపోవటంతో సీఎం జగన్ వద్ద పంచాయితీ పెట్టేందుకు మంత్రి పెద్దిరెడ్డి ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది.
Comments 1