జగన్ పాలనలో టీడీపీ నేతలు, కార్యకర్తలలకు రక్షణ లేకుండా పోయిందని, వారిపై వైసీపీ నేతలు, కార్యకర్తల దాడులు పెరిగిపోయాయన్న ఆరోపణలు వస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ ప్రభుత్వాన్ని, సీఎం జగన్ ను విమర్శిస్తే చాలు…అక్రమ కేసులు బనాయించడం, వారి ఇళ్లపై దాడులు చేయించడం నిత్యకృత్యమైంది. సాక్ష్యాత్తూ టీడీపీ అధినేత చంద్రబాబు ఇంటిపై గత ఏడాది వైసీపీ నేతలు దాడికి ప్రయత్నించడం వారి బరితెగింపునకు నిదర్శనం.
ఇటీవల అయ్యన్న ఇంటి ప్రహరీ గోడ కూల్చిన ఘటన…పల్నాడులో టీడీపీ కార్యకర్త జాలయ్య హత్యోదంతం వంటి ఘటనలతో జగన్ తన కక్షా రాజకీయాలు కొనసాగిస్తూనే ఉన్నారు. ముఖ్యంగా గత దశాబ్దకాలంగా ప్రశాంతంగా ఉంటోన్న పల్నాడు ప్రాంతంలో వైసీపీ నేతల దాష్టీకాలు ఎక్కువయ్యాయి. టీడీపీ నేతలను టార్గెట్ చేసి మరీ దాడులు చేయడం, హత్యలు చేయడం పెరిగిపోయింది. గతంలోనూ ఎన్నికల సమయంలో అధికార, ప్రతిపక్ష పార్టీల నేతల మధ్య అడపాదడపా గొడవలు, హత్యలు జరిగినప్పటికీ..ఈ రేంజ్ లో హింసాత్మక ఘటనలు జరిగిన దాఖలాలు లేవు.
జాలయ్య హత్యోదంతం మరువక ముందే తాజాగా మరోసారి పల్నాడు ప్రాంతం రక్తసిక్తమైంది. పల్నాడు జిల్లా రొంపిచర్ల మండల టీడీపీ అధ్యక్షుడు వెన్నా బాలకోటిరెడ్డిపై హత్యాయత్నం జరగడం కలకలం రేపుతోంది. వాకింగ్ కు వెళుతున్న బాలకోటిరెడ్డిపై ప్రత్యర్థులు పథకం ప్రకారం గొడ్డళ్లతో దాడి చేశారు. పక్కా ప్లాన్ ప్రకారం బాల కోటిరెడ్డిపై దాడికి తెగబడి విచక్షణారహితంగా గొడ్డళ్లతో నరికారు. దీంతో, తీవ్రంగా గాయపడ్డ బాలకోటిరెడ్డిని స్థానికులు ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. గొడ్డళ్ల దాడితో తీవ్ర గాయాలు, తీవ్ర రక్తస్రావం అయిన బాలకోటిరెడ్డిని కాపాడేందుకు వైద్యులు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతానికి బాలకోటిరెడ్డి పరిస్థితి విషమంగా ఉందని తెలుస్తోంది.