సీపీఐ జాతీయ కార్యదర్శి కంకణాల నారాయణ స్వామీజీకే పరీక్ష పెట్టారా ? క్షేత్రస్ధాయిలో జరుగింది చూస్తుంటే అలాగే ఉంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్లో (జీవిఎంసీ) సీపీఐ తరపున 97వ వార్డుకు కార్పొరేటర్ గా పోటీ చేస్తున్న యశోధను పరిచటం చేశారు. రాబోయే ఎన్నికల్లో ఈమెను గెలిపించాల్సిందిగా స్వామీజీని నారాయణ కోరటమే ఆశ్చర్యంగా ఉంది.
ఇక్కడ గమనించాల్సిందేమంటే శారధాపీఠం స్వామీజీ స్వరూపానందేంద్ర స్వామితో జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహిత సంబంధాలున్నాయి. ఇదే సమయంలో స్వామీజీని నారాయణ లాంటి వాళ్ళు రెగ్యులర్ గా విమర్శిస్తున్నారు. మామూలుగానే కమ్యూనిస్టులు దేవుళ్ళు, దేవాలయాలు, స్వామీజీలను పట్టించుకోరు. దేవుళ్ళు, దేవాలయాల జోలికి వెళ్ళకపోయినా ఎక్కడ అవకాశం దొరకినా వెంటనే స్వామీజీలపై విరుచుకుపడిపోతుంటారు.
నారాయణ కూడా గతంలో స్వామీజీపై చాలాసార్లు ఆరోపణలు, విమర్శలు చేసినవారే. అలాంటి నారాయణ హఠాత్తుగా పీఠానికి వెళ్ళి స్వామీజీని కలవటం, దాదాపు 15 నిముషాలు భేటీ అవ్వటమే విచిత్రంగా ఉంది. పైగా తమ అభ్యర్ధిని స్వామికి పరిచయం చేసి గెలిపించాలని కోరటమంటే స్వామీజీకి పరీక్ష పెట్టినట్లుగానే ఉంది. నిజానికి ఏ ఎన్నికల్లో కూడా స్వామీజీ పలానా పార్టీకి ఓట్లేయమని కానీ వేయవద్దని కానీ ఎప్పుడూ చెప్పలేదు.
పీఠానికి వెళ్ళిన వాళ్ళు తమకు స్వామీజీ ఆశీస్సులున్నాయని చెప్పుకుంటున్నారంతే. సీపీఐ అభ్యర్ధి యశోధ కూడా బహుశా అలానే చెప్పుకుంటారేమో చూడాలి. ఏదేమైనా సీపీఐ అభ్యర్ధి గెలుపోటములు స్వామీజీకి పెద్ద పరీక్షగా మారినట్లే ప్రచారం ఊపందుకుంది. అభ్యర్ధులను మీరు గెలిపిస్తారట కదా అన్న నారాయణ ప్రశ్నకు స్వామీజీ చిరునవ్వే సమాధానంగా నిలిచింది. అందుకనే ఇపుడు యశోధ ఎన్నికల వ్యవహారం జీవీఎంసీలో హాట్ టాపిక్ గా నిలిచింది.