పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ నేతలు అక్రమాలకు పాల్పడినా, బెదిరింపులకు దిగినా లెక్కచేయకుండా టీడీపీ బలపరిచిన అభ్యర్థులు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. వైసీపీ దౌర్జన్యాలకు అభ్యర్థులు భయపడకుండా వారికి వెన్నుదన్నుగా టీడీపీ అధినేత చంద్రబాబు, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ ఉండి ఎప్పటికప్పుడు వారికి ధైర్యం చెప్పారు. ఇక, మున్సిపల్ ఎన్నికలు పార్టీ గుర్తుతో జరగబోతున్న నేపథ్యంలో మున్సిపల్ ఎన్నికల ప్రచార బరిలో చంద్రబాబు, లోకేశ్ డైరెక్ట్ గా రంగంలోకి దిగారు.
ఈ క్రమంలోనే తాజాగా విశాఖలో జీవీఎంసీ ఎన్నికల ప్రచారంలో భాగంగా గాజువాకలో లోకేశ్ పర్యటించారు. గాజువాకలో నిర్వహించిన రోడ్ షోలో జగన్ పై లోకేశ్ నిప్పులు చెరిగారు. మున్సిపల్ ఎన్నికల్లో విశాఖ ప్రజలు వైసీపీని తరిమికొట్టాలని లోకేష్ పిలుపునిచ్చారు. పెన్షన్ లు ఇతర పథకాల నగదును పెంచుతూ పోతామన్న జగన్ … సిమెంట్, ఇసుక, కరెంట్ ధర, పెట్రోలు నూనె ధరలు పెంచుతూ పోయారని నిప్పులు చెరిగారు.
రేషన్ సరుకులు డోర్ డెలివరీ అని చెప్పిన జగన్…రోడ్లపైకి వినియోగదారులు వచ్చి బండి డోర్ తెరిస్తేనే రేషన్ ఇస్తున్నారని మండిపడ్డారు. ఆదివారం అంటేనే విశాఖవాసులు హడలిపోతున్నాని, ఏ ఇంటి గోడకూలుస్తారో అని భయభ్రాంతులకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఏ2 వచ్చాకే విశాఖలో భూదందాలు పెరిగాయని, అక్రమాలు పెరిగాయని లోకేశ్ ఆరోపించారు. రోడ్లకు గుంతలు పూడ్చలేదని, కానీ, రాజధాని తెస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నారని మండిపడ్డారు.
ఆంధ్రుల హక్కు అయిన విశాఖ ఉక్కు కోసం మరోసారి పోరాటాలు చేసే దుస్ధితిని జగన్ తెచ్చారని దుయ్యబట్టారు. ప్రత్యేక హోదా రావడం సంగతి దేవెడెరుగు…ఉన్న ఉక్కు కర్మాగారాన్ని కోల్పోయే పరిస్థితిని జగన్ సర్కార్ తెచ్చిందని మండిపడ్డారు. జీవీఎంసీ ఎన్నికల్లో 10 వాగ్దానాలతో టీడీపీ ప్రజల ముందుకు వచ్చిందని చెప్పారు. ఇంటి పన్నులు సగం చేస్తామని, నీటి పన్ను మాఫీ చేస్తామని హామీ ఇచ్చారు. జీవీఎంసీ ఎన్నికల్లో టీడీపీని గెలిపించాలని కోరారు.