ఏపీలో మునిసిపల్ ఎన్నికల నామినేషన్ల బలవంతపు ఉపసంహరణలపై కుప్పలు తెప్పలుగా ఫిర్యాదులు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ ఫిర్యాదుల నేపథ్యంలో ఆ తరహా నామినేషన్లపై వచ్చిన ఫిర్యాదులను పరిశీలించి మరో అవకాశం కల్పించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్ కుమార్ ఆదేశాలిచ్చారు. మంగళవారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నిర్దేశించిన ప్రాంతాల్లో నామినేషన్లు కూడా స్వీకరించారు.
అయితే, ఈ ఉత్తర్వులపై కొందరు హైకోర్టులో పిటిషన్ వేశారు. తాజాగా వాటిపై విచారణ జరిపిన హైకోర్టు ఎస్ఈసీ ఆదేశాలను నిలిపివేస్తూ తీర్పునిచ్చింది. అంతేకాదు, వాలంటీర్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఇచ్చిన ఆదేశాలను కూడా హైకోర్టు నిలిపివేసింది. వాలంటీర్ల నుంచి ఫోన్లు స్వాధీనం చేసుకోవద్దని కోర్టు ఆదేశించింది. పంచాయతీ ఎన్నికల్లో ఓటర్లను వాలంటీర్లు ప్రలోభపెట్టారన్న ఆరోపణలు వచ్చాయి.
దీంతో, మున్సిపల్ ఎన్నికల అయిపోయే వరకు వాలంటీర్ల సేవలను తాత్కాలికంగా నిలిపివేయాలని, వారి ఫోన్లను స్వాధీనం చేసుకోవాలని నిమ్మగడ్డ ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఈ వ్యవహారంపై కూడా పిటిషన్ దాఖలు చేయగా…విచారణ జరిపిన కోర్టు…ఫోన్లు తీసుకోవద్దంటూ ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుపై ఎస్ఈసీ స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.
అంతకుముందు, నామినేషన్ల బలవంతపు ఉపసంహరణలను అంగీకరించవద్దని తమ అధికారులకు ఎస్ఈసీ స్పష్టం చేసింది. నామినేషన్ల ఉపసంహరణ నోటీసులను యాంత్రింకంగా, మూడో పక్షం నుంచి వాటిని అంగీకరించవద్దని స్పష్టం చేసింది. అలాగే, ఉపసంహరణ ప్రక్రియ సమయంలో వీడియోలను తీయాలని ఆదేశించింది.