విడిపోయి కలిసి ఉందాం. ఒకటిగా ఉన్న రాష్ట్రం రెండుగా మారితే.. ఒకరితో ఒకరు పోటీ పడి.. డెవలప్ మెంట్ లో దూసుకెళదాం.. ఇలా ఉమ్మడి రాష్ట్రంలో చాలానే మాటలు వినిపించాయి. ఒక రాష్ట్రంగా ఉన్న ఏపీ రెండు రాష్ట్రాలుగా మారింది. ఆరేళ్లు దాటేసి ఏడో ఏడాదికి వెళుతున్న వేళ.. రెండు రాష్ట్రాల అభివృద్ధి ఎలా ఉంది? అన్న ప్రశ్న వేస్తే.. ఆసక్తికర అంశాలు వెలుగు చూస్తున్నాయి.
విడిపోయిన తర్వాత డెవలప్ కావటం తర్వాత సంగతి.. రెండు రాష్ట్రాలు చేస్తున్న అప్పులతో మోత మోగుతోంది. క్యాలండర్ లో ఏడాది మారే కొద్దీ అప్పుల కొండ అంతకంతకూ పెరిగి పెద్దది అవుతుందే తప్పించి తగ్గట్లేదు. అరవైఏళ్లు ఉమ్మడి రాష్ట్రంలో చేసిన అప్పుకు మించిన రుణాన్ని కేవలం ఆరేళ్ల వ్యవధిలో చేయటం గమనార్హం. ఇది సరిపోదన్నట్లుగా కరోనా కారణంగా ప్రభుత్వానికి వచ్చే ఆదాయాలు భారీగా పడిపోవటంతో సర్కారు బండి నడిపించేందుకు మరింత భారీగా రుణాల్ని సేకరిస్తున్న పరిస్థితి.
కరోనా నేపథ్యంలో 2020 ఏప్రిల్ నుంచి డిసెంబరు మధ్య ఏపీ రూ.44,250 కోట్లను అప్పుగా తీసుకొస్తే.. తెలంగాణ రాష్ట్రం రూ.36,354 కోట్లను రుణాలుగా తీసుకొచ్చాయి. అంటే.. కేవలం ఎనిమిది నెలల వ్యవధిలో రెండు రాష్ట్రాలు తీసుకొచ్చిన అప్పు ఏకంగా రూ.80,600 కోట్లు. ఇదే సమయానికి పొరుగున ఉన్న మహారాష్ట్ర రూ.65వేల కోట్లు తీసుకొస్తే.. తమిళనాడు రూ.63 కోట్లు తీసుకొచ్చాయి. కర్ణాటక రూ.55వేల కోట్ల అప్పుల్ని తీసుకొచ్చాయి. రాజస్థాన్ రూ.39వేల కోట్లు తీసుకొచ్చినట్లుగా రిజర్వుబ్యాంకు నివేదిక స్పష్టం చేస్తుంది.
ఈ లెక్కన చూస్తే.. తెలుగు రాష్ట్రాల అప్పు భారీగా ఉన్నట్లు అర్థమవుతుంది. ఒకవేళ విభజన కాని జరిగి ఉండకపోతే.. దేశంలో అత్యధిక రుణాన్ని తీసుకొచ్చిన రాష్ట్రంగా నిలిచేదేమో? ఆందోళన కలిగించే విషయం ఏమంటే.. బహిరంగ మార్కెట్ నుంచి భారీగా రుణాలు తీసుకుంటున్నా.. రాష్ట్రాల ఆర్థిక అవసరాలు మాత్రం తీరటం లేదు. చేబదుళ్లు.. స్పెషల్ డ్రాయింగ్.. ఓవర్ డ్రాఫ్టులను ఆశ్రయిస్తున్నాయి.
డిసెంబరులో ఏపీ సర్కారు ఏకంగా 30 రోజు లపాటు స్పెషల్ డ్రాయింగ్ సౌకర్యాన్ని వాదుకుంటే.. తెలంగాణ 28 రోజుల పాటు వాడుకుంది. ఏపీ26 రోజుల పాటు చేబదుళ్లు తీసుకుంటే.. తలెంగాణ 20 రోజుల పాటు తీసుకుంది. ఓవర్ డ్రాప్టును ఏపీ మూడు రోజుల పాటు వాడుకుంటే.. తెలంగాణ 13 రోజుల పాటు వినియోగించుకుంది. ఇలా.. అప్పులు.. చేబదుళ్లతో పాలనా రథాన్ని నడుపుతున్న తీరు చూస్తే.. విడిపోయి సాధించిందేమిటి? అన్న సందేహం కలుగక మానదు.