దళిత బంధు పేరిట నిధులు పక్కదోవ పడుతున్నాయని ఎప్పటి నుంచో ఆరోపణలు వస్తున్నాయి. వాటిపై కూడా విచారణ అన్నది సాగుతూనే ఉంది. కానీ దోషులు ఎవ్వరు ఏంటన్నది ఇప్పటిదాకా తెలియరావడం లేదు. తెలంగాణ వాకిట అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశ పెట్టి అమలు చేయాలనుకున్న పథకం దళిత బంధు. కానీ ఆ మేరకు ఆయన ఆశయం నెరవేరక మధ్యవర్తుల ప్రమేయంతో పూర్తిగా నీరుగారిపోతుందన్న వాదనలకు ఆధారాలు అనేకం.
ముఖ్యంగా ఒక్కో లబ్ధిదారునకూ పది లక్షల రూపాయల చొప్పున అందిస్తుండడంతో అంత మొత్తంలో డబ్బులు రావడం, వాటి వెనుక రాజకీయ ఒత్తిడి ఉండడం తదితర కారణాల రీత్యా ఈ పథకం లక్ష్యం కాస్త జావగారిపోతోంది. ఒక్కో లబ్ధిదారుడి దగ్గర నుంచి రెండు లక్షల రూపాయలు వసూలు చేస్తున్నారని కూడా తెలుస్తోంది.
వాస్తవానికి దళిత బంధు నిధులు నేరుగా ఇవ్వరు. ఏమయినా ఎంపిక చేసిన యూనిట్లు ఏర్పాటు చేసుకుంటేనే ఆ నిధులు ఖర్చుకు అనుమతి ఉంటుంది. ఇక్కడే అంతా మతలబు ఉంది. లబ్ధిదారులతో అధికారులు, ఇతర రాజకీయ నాయకులు ములాఖత్ అయి డబ్బులు గుంజేస్తున్నారని, యూనిట్ల ఏర్పాటులో మాయాజాలం నెలకొని ఉంటున్నదని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వీటి వెనుక అధికార పార్టీ ఎమ్మెల్యేల హవా నడుస్తుందని ఆరోపణలు వినిపిస్తున్నాయి.
వాస్తవానికి లబ్ధిదారుల జాబితాలో పేరు ఉండాలంటే, ప్రభుత్వం విడుదల చేసే తొలి జాబితాలోనే పేరు ఉండాలంటే తమకు రెండు లక్షలు చెల్లించాల్సిందేనని అధికార పార్టీ సభ్యులు డిమాండ్ చేస్తూ ఉన్నారు. దాంతో తమకు దళిత బంధు ఎప్పటికైనా దక్కకపోదా అన్న ఆశతో డబ్బులు తెచ్చి ఇస్తున్నారు అని తెలుస్తోంది. కానీ తీరా యూనిట్లు మంజూరు కాక నిధులు రాక ఏడాది కావస్తున్నా తమకు ఎటువంటి భరోసా సంబంధిత నాయకుల నుంచి దక్కక వీరంతా లబోదిబోమంటున్నారు.
ఈ మోసాలు వెలుగులోకి రావడం లేదు. పోలీసు స్టేషన్ గడప తొక్కేందుకు కూడా వీల్లేకుండా పరిస్థితులు ఉన్నాయి. దీంతో చేసేది లేక అప్పు చేసి తెచ్చిన డబ్బులకు కొందరు వడ్డీలు కట్టలేక నానా అవస్థలూ పడుతున్నారు. ఆదిలాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాలలో ఇదే విధంగా జరిగిందని తెలుస్తోంది. తొలి రోజుల్లో పథకం అమల్లో ఉన్న నియమ నిబంధనల వర్తింపు ఇప్పుడు కూడా ఉన్నప్పటికీ కొందరు ఎమ్మెల్యేలు ఉన్నతాధికారులను, కలెక్టర్ స్థాయి వ్యక్తులను మేనేజ్ చేసి జిల్లాలలో చక్రం తిప్పుతున్నారన్న ఆరోపణలే అధికంగా ఉన్నాయి.