త్వరలో జరగబోతోన్న మున్సిపల్ ఎన్నికల్లో సత్తా చాటేందుకు టీడీపీ గట్టి ప్రణాళికలు రూపొందిస్తోన్న సంగతి తెలిసిందే. 13 జిల్లాలలోనూ విజయ కేతనం ఎగురవేసి వైసీపీకి షాకివ్వాలని టీడీపీ నేతలు యోచిస్తున్నారు. అన్నింటికంటే ముఖ్యంగా విజయవాడ, విశాఖ మేయర్ పీఠాలను ఎట్టిపరిస్థితుల్లోనూ గెలుచుకోవాలని కృత నిశ్చయంతో ఉన్నారు. భవిష్యత్తులో పాలనా రాజధాని అయ్యే అవకాశమున్న విశాఖలో పాగా వేయాలని టీడీపీ నేతలు యోచిస్తున్నారు.
అందులోనూ విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం వ్యవహారంలో వైసీపీపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతను క్యాష్ చేసుకోవాలని టీడీపీ నేతలు ప్లాన్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే గ్రేటర్ విశాఖపట్నం మునిసిపల్ కార్పొరేషన్ (జీవీఎంసీ) ఎన్నికలపై టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలోనే సందిగ్ధతలకు తెర దించుతూ విశాఖ కార్పొరేషన్‌కు మేయర్ అభ్యర్థిగా పీలా శ్రీనివాసరావు పేరును అచ్చెన్నాయుడు ప్రకటించారు.
వాస్తవానికి, గత ఏడాది నోటిఫికేషన్ విడుదలైన సమయంలోనే పీలా శ్రీనివాస్ వైపు జిల్లా నేతలు మొగ్గుచూపారు. ఆ తరువాత ఎన్నికలు వాయిదా పడ్డాయి. మళ్లీ తాజాగా షెడ్యూల్ ప్రకటించడంతో మేయర్ అభ్యర్థిత్వంపై తాజాగా మరోసారి చర్చలు జరిపారు. చివరకు పీలా వైపే టీడీపీ అధిష్టానం మొగ్గు చూపింది. ప్రస్తుతం పీలా శ్రీనివాస్‌తోపాటు గాజువాకకు చెందిన పార్టీ నేత కాకి గోవిందరెడ్డికూడా మేయర్ స్థానంపై ఆశలు పెట్టుకున్నారు. భవిష్యత్తులో గోవిందరెడ్డితోపాటు పెందుర్తి మాజీ ఎమ్మెల్యే గండి బాబ్జీకి సముచిత స్థానం కల్పిస్తూ తగిన న్యాయం చేయాలని టీడీపీ అధిష్టానం నిర్ణయించినట్టు తెలుస్తోంది.