టీడీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం నారా చంద్రబాబు నాయుడును రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకున్న ఘటనపై టీడీపీ నేతలు, కార్యకర్తలు మండిపడుతున్నారు. దాదాపు 5 గంటలుగా ఎయిర్ పోర్టులో చంద్రబాబు కింద నేలపై కూర్చుని నిరసన తెలుపుతున్నా పోలీసులు అనుమతివ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మధ్యాహ్నం భోజనం కూడా చేయకుండా శాంతియుతంగా చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
అంతేకాకుండా, చంద్రబాబును ఎయిర్ పోర్టు నుంచే హైదరాబాద్ పంపేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే జగన్ పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ నిప్పులు చెరిగారు. జగన్ పిరికి పాలన పతనం కాబోతోందని, దానికి రేణిగుంట ఘటనే నాంది అని లోకేశ్ మండిపడ్డారు. 2019లో పల్నాడు పర్యటనకు వెళ్లకుండా ఇంటి గేటుకి తాళ్లు కట్టి అడ్డుపడ్డారని, 2020లో విశాఖ ఎయిర్ పోర్ట్ నుండి బయటకు రాకుండా చుట్టుముట్టారని, 2021లో రేణిగుంట ఎయిర్ పోర్ట్ లో చంద్రబాబును నిర్బంధించారని లోకేశ్ దుయ్యబట్టారు. పిరికి పాలకుడు జగన్
అరాచకాలు ఇంకెన్నాళ్లు కొనసాగుతాయని నిలదీశారు. #CBNinChittoor, #CowardJagan హ్యాష్ ట్యాగ్ లను లోకేశ్ ట్రెండ్ చేశారు.
మరోవైపు, జగన్పై చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రేణిగుంట విమానాశ్రయంలో బైఠాయించి నిరసన తెలుపుతున్న చంద్రబాబు…తన ఫోన్ నుంచి జగన్ పై ట్విట్టర్ లో విమర్శలు గుప్పించారు. తనను అడ్డుకోలేరని, చిత్తూరు పర్యటన విషయంలో వెనక్కు తగ్గేది లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్రజలను కలవనీయకుండా ఆపడం తగని, భయంతో ఎన్ని రోజులు పాలన సాగిస్తావు? అని జగన్ ను ప్రశ్నించారు. ఇకనైనా జగన్ ఎదగాలి అంటూ చంద్రబాబు దుయ్యబట్టారు. కాగా, చంద్రబాబును ఎయిర్ పోర్టునుంచి బయటకు పంపాలంటూ రేణిగుంట ఎయిర్పోర్టు బయట టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆందోళనకు దిగారు. దీంతోపాటు, చంద్రబాబును అడ్డుకోవడానికి నిరసనగా ఏపీలో పలు చోట్ల టీడీపీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు నిరసనలు తెలుపుతున్నారు