కొడుకు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి. పార్టీకి సర్వాధికారి. అలాంటి అధినేతకు తల్లి అయిన వ్యక్తి ఎవరైనా తన కొడుకు పెట్టిన పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరిస్తూ.. ఇతర కారణాలు చూపించి రాజీనామా చేసే పరిస్థితి ఒకటి ఉంటుందా? అన్నది ప్రశ్న. అయితే.. అలాంటి సిత్రం ఇప్పుడు వైసీపీలో చోటు చేసుకుంది. ఏపీ ముఖ్యమంత్రిగా..వైసీపీ అదినేతగా వ్యవహరిస్తున్న జగన్మోహన్ రెడ్డి పెట్టిన పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా ఆయన తల్లి వైఎస్ విజయమ్మ ఉన్నారు.
తెలంగాణలో తన కుమార్తె వైఎస్ షర్మిల రాజకీయ పార్టీ పెట్టిన నేపథ్యంలో.. రెండు వేర్వేరు భావాలున్న పార్టీల అధినేతలకు తల్లిగా ఉంటూ.. తాను కొడుకు పార్టీకి గౌరవ అధ్యక్షురాలిగా వ్యవహరించకుండా.. ఆ పదవి నుంచి తప్పుకోవటం ఒక ఎత్తు అయితే.. ఇదంతా ఒత్తిడితో చోటు చేసుకుంటుందన్న ప్రచారం సాగింది. తమ రాజకీయ ప్రత్యర్థులు తమను దెబ్బ తీసేలా ఇలాంటి ప్రచారాలు చేస్తున్నట్లుగా చెప్పినా.. అదంతా నిజంగా నిజమన్న విషయం తాజాగా చోటు చేసుకున్న పరిణామాలు చెప్పేయటం తెలిసిందే.
వైసీపీ గౌరవ అధ్యక్షురాలి హోదా నుంచి తప్పుకోవాలన్న నిర్ణయాన్ని విజయమ్మ నిజంగానే తీసుకున్నారని అనుకున్నా.. ఆ విషయాన్ని చెప్పేందుకు ఆమె చేతిలో కాగితం పెట్టి మరీ.. తాము రాసింది చదవాలన్న విషయాన్ని చెప్పటం ఏమిటి? దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి సహధర్మచారిణిగా విజయమ్మకు ఎప్పుడేం మాట్లాడాలో తెలీని పరిస్థితి ఉంటుందా?
దశాబ్దాల తరబడి రాజకీయంలో మునిగి తేలిన ఆమెకు.. ఒక అరుదైన పరిణామానికి తగ్గట్లుగా మాట్లాడే అవకాశాన్ని.. స్వేచ్ఛను ఆమెకు ఇస్తే బాగుండేదన్న మాట వినిపిస్తోంది. అందుకు భిన్నంగా చేతిలో కాగితం పెట్టి.. దాన్లో ఉన్న అంశాలు మాత్రమే మాట్లాడాలన్నప్పుడు.. కొడుకు కోసం కాదనలేక ఆమె మాట్లాడిన మాటలు ఏవీ అతకనట్లుగా ఉండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఇలాంటి పనులు చేసే వేళలో.. స్క్రిప్టు రాసే మహానుభావుడు మరికాస్త ఒళ్లు దగ్గర పెట్టుకొని ప్రసంగ పాఠాన్ని రాసి ఇస్తే బాగుండేది కదా? అన్నది ప్రశ్న.
పదవి నుంచి తప్పుకోవటానికి విజయమ్మ చెప్పిన మాటలు అతకనట్లుగా ఉండటంతో పాటు.. ఈ మాత్రం దానికే రాజీనామా చేయాల్సిన అవసరం ఏమిటి? అన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి.ఎందుకిలా అంటే.. తన రాజీనామా విషయంలో విజయమ్మ ప్రస్తావించిన అంశాలేవీ తెలంగాణలో చర్చకు కూడా రాలేదు. కనీస అభ్యంతరం లేని అంశాల్ని ప్రస్తావించి రాజీనామా చేయాల్సిన అవసరం లేదన్న మాట వినిపిస్తోంది.
ఏమైనా.. విజయమ్మ చేత అతకని మాటలు చెప్పించిన మహానుభావుడు.. జగన్ కు అత్యంత సన్నిహితంగా వ్యవహరించే పెద్ద మనిషిగా చెబుతున్నారు. ఇప్పటికిప్పుడు దీనికి సంబంధించిన వివరాలు మరిన్ని బయటకు రాకున్నా.. రానున్న రోజుల్లో దీనికి సంబంధించిన అంశాలు బయటకు రావటం.. సంచలనంగా మారటం ఖాయమని చెప్పక తప్పదు.