అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్ష నేతలపై అధికార పార్టీ నేతల కక్ష సాధింపు చర్యలు ఎలా ఉంటాయనడానికి చంద్రబాబును రేణిగుంట ఎయిర్ పోర్టులో అడ్డుకున్న ఘటనే నిదర్శనం. జగన్ సీఎం అయిన తర్వాత విశాఖ ఎయిర్ పోర్టులో చంద్రబాబును అడ్డుకుని కక్ష సాధించిన జగన్….తాజాగా రేణిగుంట ఎపిసోడ్ తో మరోసారి పులివెందుల నైజాన్ని బయటపెట్టుకున్నారు. అయితే, చంద్రబాబును రేణిగుంటలో అడ్డుకోవడాన్ని కొందరు వైసీపీ కార్యకర్తలు, అభిమానులు సమర్థిస్తున్నారు.
అంతేకాదు, గతంలో జగన్ ను వైజాగ్ ఎయిర్ పోర్టులో అడ్డుకున్నపుడు ఎవరూ మాట్లాడలేదని…అటువంటిది చంద్రబాబును అడ్డుకోగానే రాద్ధాంతం చేస్తున్నారని వైసీపీ అభిమానులు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వారికి టీడీపీ సోషల్ మీడియా వింగ్ దిమ్మదిరిగే కౌంటర్లు ఇస్తోంది. జగన్ కు తమ నేతకు ఉన్న తేడాలను ఆధారాలతో సహా బయటపెడుతోంది.
నాడు జగన్ ను అడ్డుకున్నపుడు నేనే కాబోయే సీఎం….మీ అందరినీ గుర్తుంచుకుంటా అంటూ విమానాశ్రయంలోనే పోలీసులపై చిందులు తొక్కారు. నేడు చంద్రబాబు మౌనంగా ఎయిర్ పోర్టులో బైఠాయించి శాంతియుతంగా నిరసన తెలుపుతున్నారు. తన దగ్గరికే కలెక్టర్, ఎస్పీలను తీసుకువస్తానన్నా..వద్దని వారించిన చంద్రబాబు…. పోలీసులతో సంయమనం పాటిస్తూ హుందాగా ప్రవర్తించారు.
నాడు జగన్ వైజాగ్ లో పర్యటించాలనుకున్న అదే రోజున… పెట్టుబడుల కోసం విశాఖలో అత్యంత భారీ స్థాయిలో సదస్సు జరుగుతోంది. చంద్రబాబు హయాంలో పెట్టుబడులు వస్తే ఆయనకు మంచి పేరు వస్తుందని, కాబట్టి అడ్డుకోవాలన్న ఉద్దేశంతో వైసీపీ ధర్నాకు ఆనాడు పిలుపునిచ్చింది.
నేడు టీడీపీ కార్పొరేటర్లను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసి పార్టీ మార్చాలని వైసీపీ నేతలు చూస్తున్న సందర్భంలో టీడీపీ అభ్యర్థులకు అండగా నిలబడేందుకు చిత్తూరులో ధర్నా చేయాలని చంద్రబాబు పర్యటించాలనుకున్నారు. ఇలా జగన్ పర్యటన, చంద్రబాబు పర్యటనలపై సోషల్ మీడియాలో వార్ జరుగుతోంది.