టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబును తిరుపతిలోని రేణిగుంట విమానాశ్రయంలో పోలీసులు అడ్డుకోవడంపై టీడీపీ నేతలు మండిపడుతున్నారు. చంద్రబాబు, ఆయన పీఎ, వైద్యుడి దగ్గర నుంచి ఫోన్లు లాక్కున్న పోలీసులు…ఆయనను రేణిగుంట ఎయిర్‌పోర్టు నుంచి హైదరాబాద్‌కు తిరిగి పంపేందుకు ప్రయత్నిస్తుండడంపై టీడీపీ నేతలు నిప్పులు చెరుగుతున్నారు. సొంత జిల్లాలో చంద్రబాబు పర్యటనను ప్రభుత్వం, పోలీసులు అడ్డుకుంటున్నారని, ఎస్ఈసీ అనుమతి ఉన్నప్పటికీ ఎయిర్‌పోర్టులోనే నిర్బంధించడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో విశాఖలో మీడియాతో మాట్లాడిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు….జగన్ సర్కార్ పై మండిపడ్డారు. పోలీసులు బుర్ర పెట్టి పని చేస్తున్నారా..? లేదా..? అనేది అర్థం కావడం లేదని, ప్రభుత్వ దమనకాండకు ఆటంకం కలుగుతుందని పోలీసులు చంద్రబాబు పర్యటనను అడ్డుకుంటున్నారని ఆరోపించారు. చంద్రబాబుకు పోలీసులు క్షమాపణ చెప్పి బందోబస్తుతో పర్యటనకు అనుమతించాలని అచ్చెన్న డిమాండ్ చేశారు.
మున్సిపల్ ఎన్నికల్లో ఓటుతో జగన్ ను చితక కొట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని, అభ్యర్థులను భయపెట్టి, యునానిమస్ చేసుకోవాలని వైసీపీ కుట్ర చేస్తోందని అచ్చెన్న ఆరోపించారు. ఎస్పీని కలెక్టర్‌ని చంద్రబాబు కలిస్తే ఇబ్బంది ఏంటని ఆయన ప్రశ్నించారు. విశాఖపట్నంలో ఒక బ్రోకర్ పాదయాత్ర చేసి అంబులెన్స్‌లకు అడ్డు పడినప్పుడు పోలీసులకు కనిపించలేదా..అని ప్రశ్నించారు. ఆనాడు జగన్ ను అడ్డుకున్నపుడు కుక్కలా తిరిగాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ప్రజలు తిరగబడవలసిన అవసరం ఉందని, ఓటమి భయంతోనే జగన్ ఇదంతా చేస్తున్నారని అచ్చెన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ప్రభుత్వం ప్రతిపక్షాలపై అక్కసు వెళ్లగక్కుతుంది. ఒక ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా రాష్ట్రంలో ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ చంద్రబాబుకి ఉంది. ప్రభుత్వం ఇలా నాయకుల్ని నిర్బంధించడం, ఎయిర్ పోర్ట్ కి వచ్చిన వారిపై ఇష్టానుసారంగా వ్యవహరించడం దుర్మార్గపు చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. వెంటనే ప్రభుత్వ పెద్దలు సమాధానం చెప్పాలి’ అని గోరంట్ల బుచ్చయ్య చౌదరి ట్వీట్ చేశారు.
కుప్పం పర్యటనలో చంద్రబాబుకు ప్రజలు నీరాజనం పలికారని, అందుకే చంద్రబాబు చిత్తూరు పర్యటనను జగన్ అడ్డుకుంటున్నారని మాజీ మంత్రి దేవినేని ఉమమహేశ్వరరావు ఆరోపించారు. జగన్మోహన్ రెడ్డిది పిరికిపంద చర్య అని, మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తన భర్త కర్మ సందర్భంగా ఆయన సమాధి వద్దకు వెళ్లకుండా హౌస్ అరెస్ట్ చేశారని దుయ్యబట్టారు.
చంద్రబాబు నాయుడిని సొంత జిల్లాలో పర్యటించకుండా అడ్డంకులు సృష్టించడం దురదృష్టకరమని మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు..ఎస్ఈసీ అనుమతితో చిత్తూరుకు వెళితే ఎయిర్ పోర్టులోనే నిర్బంధించడం ఏమిటని మండిపడ్డారు. ఏపీలో ప్రజా ప్రభుత్వం కాదు.. పోలీస్ పాలన నడుస్తున్నట్టుందని సోమిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబును చూసి ప్రభుత్వం భయపడుతోందని మాజీ మంత్రి, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రతిపక్ష నాయకుడు రాష్ట్రంలో పర్యటించే హక్కు లేదా?అని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు అంటే జగన్ కు భయమని, ప్రభుత్వానికి పోలీసులు తొత్తులుగా మారిపోయారని ఆరోపించారు. చంద్రబాబు పర్యటనకు అనుమతివ్వకుంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు.
ఏపీలో నియంతపాలన కొనసాగుతోందని శాసనమండలి ప్రతిపక్షనేత యనమల రామకృష్ణుడు జగన్ పై మండిపడ్డారు. చంద్రబాబు నిర్బంధం అప్రజాస్వామికమని, అది పౌర స్వేచ్ఛను హరించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు పేరు వింటేనే జగన్మోహన్ రెడ్డి వెన్నులో వణుకు పుడుతోందని, జగన్మోహన్ రెడ్డి చర్యలు హిట్లర్ పాలనను తలపిస్తున్నాయని దుయ్యబట్టారు.రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైందని, ఏపీలో రూల్ ఆఫ్ లా ఉందా? అని ప్రశ్నించారు. చర్యకు ప్రతి చర్య తప్పదని వైసీపీ నేతలు గుర్తుంచుకోవాలని వార్నింగ్ ఇచ్చారు.