ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్ ఏది చేసినా సంచలనమే. మస్క్ కు ఉన్న ఇమేజ్ అటువంటిది. అందుకే, మస్క్ ట్విటర్ ను కొంటున్నాడనగానే అంతా షాకయ్యారు. అయితే, ఎంత హడావిడిగా ట్విటర్ ను సొంతం చేసుకోవాలని మస్క్ ప్రయత్నించాడో…అంతకంటే వేగంగా ట్విటర్ డీల్ నుంచి మస్క్ తప్పుకున్నాడు. తాజాగా ఈ విషయాన్ని ట్విట్టర్ ఛైర్మన్ బ్రెట్ టేలర్ స్వయంగా ప్రకటించడం హాట్ టాపిక్ గా మారింది.
ట్విట్టర్ కు మస్క్ అనూహ్యంగా షాకిచ్చాడు. ఆ సంస్థతో చేసుకున్న ఒప్పందంలో చెప్పిన దానికి భిన్నంగా వాస్తవ పరిస్థితులున్నాయంటూ కొంతకాలంగా మస్క్ ఆరోపిస్తున్నాడు. ట్విటర్ లో నకిలీ అకౌంట్ల 5 శాతం కంటే తక్కువ ఉందని ట్విట్టర్ అంటోంది. అయితే, అది తప్పని..ఆ సంఖ్య ఇంకా ఎక్కవని మస్క్ వాదిస్తున్నాడు. ట్విట్టర్ తమకు పూర్తి సమాచారం ఇవ్వలేదని, తప్పుడు సమాచారం కూడా అందించిందని మస్క్ తరఫు న్యాయవాదులు అంటున్నారు.
అందుకే, ట్విట్టర్ డీల్ ను హోల్డ్ లో పెట్టినట్లు గతంలో ప్రకటించిన మస్క్..తాజాగా పూర్తిగా ఈ డీల్ నుంచి తప్పుకుంటున్నట్లు కుండబద్దలు కొట్టేశారు. అయితే, మస్క్ పై అగ్రిమెంట్ ప్రకారం లీగల్ యాక్షన్ తీసుకుంటామని టేలర్ తెలిపారు. ట్విట్టర్ ను 44 బిలియన్ డాలర్లకు మస్క్ కొనాలనుకున్నాడు. ఒకవేళ ట్విటర్ ను మస్క్ కొనకపోతే 1 బిలియన్ డాలర్ల పెనాల్టీ చెల్లించాల్సి ఉంటుంది. అంటే, భారత కరెన్సీలో దాదాపు 8వేల కోట్లు. అయితే, మస్క్ పెనాల్టీ చెల్లిస్తారా లేక న్యాయపోరాటం చేస్తారా అన్నది తేలాల్సి ఉంది.