అమెరికాలోని న్యూజెర్సీ స్టేట్ అసెంబ్లీ నుంచి అవార్డునందుకున్నారు టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ వెల్లలచెరువు రజనీకాంత్. అక్కడి తెలుగువారి సమక్షంలో సత్కారం అందుకున్న ఘనత దక్కించుకున్నారాయన.
మెరుగైన సమాజం కోసం తపన పడే న్యూస్ చానల్స్ లో టీవీ9 ఒకటి. ఎలక్ట్రానిక్ మీడియాలో 18 ఏళ్లుగా సేవలందిస్తోంది. అలాంటి చానల్ కు మరోసారి ప్రపంచ స్థాయి గుర్తింపు దక్కింది. టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ ను అమెరికాలోని న్యూజెర్సీ స్టేట్ అసెంబ్లీ సత్కరించింది. తెలుగువాళ్ళ సమక్షంలో న్యూజెర్సీ స్టేట్ అసెంబ్లీ సెనేటర్ ఆండ్రూ గ్వికర్ ప్రత్యేక ప్రశంసా పత్రాన్ని ఇచ్చి సత్కరించడం విశేషం. మీడియా రంగంలో రజనీకాంత్ చేసిన సేవలను కొనియాడింది న్యూజెర్సీ స్టేట్ అసెంబ్లీ. రజనీకాంత్ ఇక ముందు కూడా ఇలాంటి సేవలనే అందించాలని ప్రజా సేవలో ముందుండాలని ఆకాంక్షించింది.
ఫస్ట్ ఇండియన్ జర్నలిస్టు….
మీడియా రంగ ప్రముఖులను ఇలా ఘనంగా సత్కరించడం, ప్రశంసా పత్రం ఇవ్వడం. అందులోను భారతీయుడికి…ముఖ్యంగా తెలుగువాడికి ఇవ్వడం న్యూజెర్సీ చరిత్రలో ఇదే తొలిసారి. టీవీ9 తెలుగులో బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ తో రోజు ప్రేక్షకుల ముందుకు వస్తారు రజనీకాంత్. అలాంటి రజనీకాంత్ కు రెండున్నర దశాబ్దాల కెరీర్ లో ఎన్నో అవార్డులు వచ్చాయి. రివార్డులు దక్కాయి. సత్కారాలు, ఘన సన్మానాలు జరిగాయి. అవన్నీ ఒక ఎత్తు అయితే..అమెరికాలోని న్యూజెర్సీ స్టేట్ అసెంబ్లీ గౌరవం పొందడం మరో ఎత్తు. న్యూజెర్సీ స్టేట్ అసెంబ్లీ తీర్మానంతో సత్కారం అందుకున్న మొదటి ఇండియన్ జర్నలిస్ట్ గా రికార్డు పుటలకెక్కారు రజనీకాంత్.
అవార్డులు ఎక్కువే…
అన్యాయం, అవినీతి, అక్రమాలు, కబ్జా కోరులు, మాఫియా డాన్ ల పై స్టోరీలు వేసి వాస్తవాలను వెలుగులోకి తెస్తోంది టీవీ9. ఈ 18 ఏళ్ల ప్రయాణం లో టీవీ 9 నేషనల్, రీజినల్, సెన్సేషనల్ అవార్డ్స్ ని ఎన్నో గెలిచింది. తెలుగు మీడియా రంగంలో అనేక మైలురాళ్లను అందుకుంది. బెస్ట్ రిపోర్టింగ్, బెస్ట్ గ్రాఫిక్స్, బెస్ట్ డిబెట్, బెస్ట్ యాంకరింగ్, బెస్ట్ ప్యాకేజింగ్, బెస్ట్ ప్రోగ్రామింగ్, బెస్ట్ ఎంటర్టైన్మెంట్ వంటి విభాగాల్లో వందలాది అవార్డులు ఆ చానల్ కు వరించాయి. ఇందులో రజనీకాంత్ కు వచ్చినవి ఉన్నాయి.
బెస్ట్ యాంకర్, బెస్ట్ ప్రైమ్ టైమ్ షో గా న్యూస్ టెలివిజన్ (NT) 2022లోను అవార్డులను ఇటీవలనే అందుకున్నారు రజనీకాంత్. టీవీ9 తెలుగులో సాయంత్రం 7 గంటలకు వచ్చే బిగ్ న్యూస్ బిగ్ డిబేట్ ప్రేక్షకాదరణ పొందుతోంది. వివిధ సామాజికాంశాలు, రాజకీయ కోణాలు, ప్రజలకు ప్రయోజనాన్ని ఇచ్చే అంశాల పై డిబేట్స్ జరుగుతున్నాయి. వాటిని చూసిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తో పాటు..మరెన్నో సామాజిక సంస్థలు అవార్డులతో సత్కరించాయి.
ప్రజా పక్షమే…
వివిధ రంగాల్లో విశేషమైన సేవలందించినందుకు ప్రభుత్వాలు, ప్రైవేటు సంస్థలు ఇలాంటి అవార్డులను ఇస్తున్నాయి. అందుకు దక్కిన ఫలితమే ప్రసంశల జల్లు. పార్టీల జెండాలు, అజెండాలతో సంబంధం లేకుండా న్యూస్ ఇస్తోంది టీవీ9. కరోనా కాలంలోను బాధితులను ఆదుకుంది. ఇటీవలనే టీవీ9 తెలుగుకు జాతీయ స్థాయిలో 19 కేటగిరిల్లో న్యూస్ చానల్ ( (NT) అవార్డులు గెల్చుకోగా, హిందీ న్యూస్ ఛానెల్ టీవీ9 భారత్ వర్ష్ 6 అవార్డులు, టీవీ9 బంగ్లా 14 అవార్డులు, టీవీ9 మరాఠీ 7 అవార్డులు వచ్చాయి. టీవీ9 నెట్ వర్క్ కు మొత్తం 46 అవార్డులు వచ్చాయి.
న్యూస్ ప్రజెంటేషన్ విషయంలో వైవిధ్యంగా ఉంది టీవీ9. ఇండియాస్ నంబర్ వన్ న్యూస్ నెటవర్క్ గా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ , గుజరాత్, కర్ణాటక, ముంబై, ఢిల్లీ, కోల్కతా, ఇలా ప్రతి భాషకి దగ్గరై ప్రజలకు అందుబాటులోకి వచ్చింది.
గతంలో….
టీవీ9 మేనేజింగ్ ఎడిటర్ రజనీకాంత్ గతంలో వార్త పేపర్ లో రిపోర్టర్ గా తన కెరీర్ ప్రారంభించారు. కొద్ది కాలం పని చేశాక హైదరాబాద్ లో సిటీ కేబుల్ లో చేరి ఎలక్ట్రానిక్ మీడియాలోకి అడుగు పెట్టారు. ఆ తర్వాత టీవీ9లో రిపోర్టర్ గా పని చేస్తూ అంచెలంచెలుగా ఎదుగుతూ మేనేజింగ్ ఎడిటర్ స్థాయికి చేరారు. న్యూజెర్సీ స్టేట్ అసెంబ్లీ అవార్డునే కాదు…ప్రజల పక్షాన ఇలానే పోరాడుతూ సేవలందిస్తూ మరిన్నో అవార్డులను అందుకోవాలని ఆకాంక్షిద్దాం.