రాజకీయాల్లో సంచలనాలు కొత్తవి కావు. అయితే.. రాజకీయాలకు సంబంధం లేకుండా.. ఇప్పటివరకు చర్చకు రాని అంశాన్ని తన రాతలతో తెర మీదకు తీసకురావటం అప్పుడప్పుడు మాత్రమే జరుగుతుంది. తాజాగా అలాంటి పనే చేశారు ఆంధ్రజ్యోతి ఎండీ ఆర్కే అలియాస్ రాధాక్రిష్ణ. చిన్నస్థాయి కంట్రిబ్యూటర్ గా సంస్థలో చేరి.. ఆ సంస్థకే ఎండీగా మారటం.. నిత్యం వివిధ పనుల్లో బిజీబిజీగా ఉండే ఆయన.. ఇప్పటికి ప్రతి వారం ఒక పొలిటికల్ ఆర్టికల్ రాయటం ఆయనకే సాధ్యం.
తాము చేస్తున్న పనికి సంబంధించి అత్యుత్తమ స్థాయికి చేరుకున్న తర్వాత.. తాము చేసిన పాత పనిని కంటిన్యూ చేసే ప్రముఖులు చాలా తక్కువ మందే ఉంటారు. అందులో ఆర్కే ఒకరిగా చెప్పాలి.తమ టీవీ చానల్ స్టూడియోలో జరిగిన ఘటన నేపథ్యంలోఆయన రాసిన తాజా వ్యాసంలో సంచలన అంశాల్ని ప్రస్తావించటం గమనార్హం. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డికి నలుగురు బీజేపీనేతలు కొమ్ము కాస్తున్నారని ఆయన రాసుకొచ్చారు.
కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని చూసుకొని రాష్ట్రంలో అందరినీ బెదిరించి బతకటానికి ఏపీ రాష్ట్ర బీజేపీలో కొందరు అలవాటు పడినట్లుగా పేర్కొన్న ఆయన.. ఈ సందర్భంగా నలుగురు బీజేపీనేతల పేర్లను పదే పదే ప్రస్తావించటం సంచలనంగా మారింది.అంతేకాదు తన వ్యాఖ్యలకు బలం చేకూరేలా.. కొందరు బీజేపీ నేతలు లోగుట్టుగా చెప్పే మాటల్ని ఆయన ప్రస్తావించటం గమనార్హం. ఇంతకీ.. ఆ నలుగురు ఎవరు? వారికి సంబంధించి ఆర్కే చేసిన ఆరోపణలు ఏమిటి? అన్నది చూస్తే..‘కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని చూసుకుని రాష్ట్రంలో అందరినీ బెదిరించి బతకడానికి రాష్ట్ర బీజేపీలో కొందరు అలవాటు పడిపోయారు.
అలాంటి వారిలో సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి, జి.వి.ఎల్ నరసింహారావు తదితరులు ఉన్నారు. వీరికి ఏపీ పార్టీ వ్యవహారాల ఇన్చార్జ్ సునీల్ దేవధర్ అండగా ఉంటున్నారని చెబుతున్నారు. ఈ నలుగురూ బీజేపీ ముసుగులో ముఖ్యమంత్రి జగన్‌రెడ్డి ప్రయోజనాలు కాపాడటానికి పనిచేస్తుంటారని స్థానిక బీజేపీ నాయకులు పార్టీ అధిష్ఠానానికి ఫిర్యాదు చేశారు కూడా’ ‘అయినా, కేంద్రప్రభుత్వాన్ని చూసి భయపడటానికి నేనేమీ జగన్మోహన్ రెడ్డి లేదా చంద్రబాబునాయుడుని కాదు. వీరిరువురూ రాజకీయ నాయకులు కనుక వారి సమస్యలు వారికి ఉంటాయి.
నేనేమీ రాజకీయ నాయకుణ్ణి కాను. ఒక సాధారణ జర్నలిస్టును మాత్రమే. వీర్రాజు అండ్ కో హెచ్చరికలకు, బహిష్కరణలకు మేం భయపడం. బీజేపీలోని ఆ నలుగురు ఈ విషయం తెలుసుకుంటే మంచిది’‘విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పు విసిరిన డాక్టర్ శ్రీనివాసరావు గతంలో ఎన్నడూ ఆ విధంగా ప్రవర్తించలేదు. అర్థవంతంగా చర్చలలో పాల్గొంటారని ఆయనకు పేరు ఉంది. అయినా, ఆయన నిగ్రహం కోల్పోయే పరిస్థితి ఎందుకొచ్చిందో విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది.
జరిగిన తప్పులో నా కొలీగ్ వెంకటకృష్ణ వైఫల్యం కానీ, చానల్ లోపం కానీ ఉండి ఉంటే కచ్చితంగా క్షమాపణ చెప్పేవాళ్లం’‘వీర్రాజు అండ్ కో పార్టీని అధికార వైసీపీకి అనుబంధ సంస్థగా మార్చేశారని బీజేపీ నాయకులే బాహాటంగా విమర్శిస్తున్నారు. విష్ణువర్ధన్ రెడ్డిపై డాక్టర్ శ్రీనివాసరావు భౌతికదాడికి పాల్పడటాన్ని పలువురు బీజేపీ నాయకులు అంతర్గతంగా స్వాగతించినట్టు చెప్పుకుంటున్నారు. పార్టీ ప్రయోజనాలను గాలికి వదిలేసి, ముఖ్యమంత్రి జగన్ రెడ్డి కళ్లలో ఆనందం చూడటమే లక్ష్యంగా వీర్రాజు, విష్ణువర్ధన్ రెడ్డి, జి.వి.ఎల్ నరసింహారావు, సునీల్ దేవధర్ పని చేస్తున్నారని బీజేపీ నాయకులే అంటున్నారు’