వైసీపీ నేత, ఎమ్మెల్సీ అనంత బాబు అలియాస్ అనంత ఉదయ్ భాస్కర్ తన మాజీ డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో అరెస్టు కావడం సంచలనం రేపిన సంగతి తెలిసిందే. జగన్ తో పాటు పలువురు వైసీపీ నేతలకు అనంతబాబు బినామీ అని, అందుకే ఈ కేసులో అనంతబాబును తప్పించేందుకు ప్రభుత్వ పెద్దలు, పోలీసులు విశ్వ ప్రయత్నాలు చేశారని ఆరోపణలు వచ్చాయి. విపక్షాలు గట్టిగా నిలదీయడంతో ఆ హత్య తానే చేశానని ఒప్పుకున్న అనంతబాబు..ప్రస్తుతం కటకటాలు లెక్కిస్తున్నారు.
అయితే, ఈ కేసును నీరుగార్చేందుకే మృతుడు సుబ్రహ్మణ్యం భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారని విమర్శలు వచ్చాయి. ఆ వివాదం సద్దుమణగక ముందే అనంతబాబుపై డ్రైవర్ సుబ్రహ్మణ్యం బాబాయి వీధి శ్రీను తాజాగా సంచలన ఆరోపణలు చేశారు. అనంతబాబు కుటుంబం నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కాకినాడ రెండో పట్టణ పోలీసులకు శ్రీను ఫిర్యాదు చేయడం షాకింగ్ గా మారింది.
అనంతబాబు కుటుంబం నివసిస్తున్న శంకర్ టవర్స్‌లో తాను వాచ్‌మన్‌గా పనిచేస్తున్నానని, తన అన్నయ్య కుమారుడి హత్య కేసులో సాక్షులుగా ఉన్న తమకు ఇప్పటికీ బెదిరింపులు వస్తున్నాయని శ్రీను ఆరోపించారు. ఈ నెల 5న అనంతబాబు తల్లి, సోదరి తన కుమార్తెను కులం పేరుతో దూషించారని సంచలన ఆరోపణలు చేశారు. ఇక్కడ పనిలో పెట్టామన్న విశ్వాసం కూడా లేకుండా నా కుమారుడిని జైలుపాలు చేస్తారా? అంటూ బెదిరించారని ఆరోపించారు.
అనంతబాబు బయటకు రాగానే మీ అంతు చూస్తామని అనంతబాబు తల్లి వార్నింగ్ ఇచ్చారని శ్రీను ఆరోపించారు. తమను చంపుతామని బెదిరించిన అనంతబాబు తల్లి, సోదరిపై చర్యలు తీసుకుని తమ ప్రాణాలను కాపాడాలని, తమకు రక్షణ కల్పించాలని పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు శ్రీను చెప్పారు. మరి, ఈ సారి కూడా వారిపై చర్యలు తీసుకునేందుకు పోలీసులు మీనమేషాలు లెక్కిస్తారా..లేక సత్వరమే స్పందిస్తారా అన్నది తేలాల్సి ఉంది.
Comments 1