విశాఖ రుషికొండ పరిసరాల్లో పర్యావరణ నిబంధనలకు విరుద్ధంగా పర్యాటక పునరుద్ధరణ ప్రాజెక్టు జరుగుతున్న తీరు పై హై కోర్టు మండిపడింది. పర్యావరణానికి మేలు చేసే పనులు ఇవి కావని తేల్చింది. పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని, కొండల తవ్వకం వద్దేవద్దని చెబుతోంది.
విశాఖలో పర్యావరణ అభివృద్ధి పేరిట రుషి కొండ చుట్టూ తవ్వకాలు సాగిస్తున్న వైనంపై హైకోర్టును ఆశ్రయించాయి జనసేన, తెలుగుదేశం పార్టీలు. ఇక్కడ నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాల పేరిట ఇష్టారాజ్యంగా సాగిపోతున్న తవ్వకాలను నిలుపుదల చేయాలని కోర్టును వారు ఆశ్రయించిన విషయం విధితమే ! కోస్టల్ రెగ్యులైజేషన్ జోన్ నిబంధనలకు విరుద్ధంగా సాగుతున్న తవ్వకాలపై కోర్టు దృష్టికి తీసుకువచ్చి., వెంటనే ఆదేశాలు ఇచ్చి పర్యావరణ పరిరక్షణకు సహకరించాలని వారు విన్నవించారు.
ఇప్పటికే విశాఖ తూర్పు ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణ ఓ కేసు దాఖలు చేయగా., తాజాగా జనసేన తరఫున అక్కడి కార్పొరేటర్ పీవీఎల్ఎన్ మూర్తి హైకోర్టు పిల్ దాఖలు చేశారు. ఇష్టారాజ్యంగా చెట్లను నరికివేస్తూ కొండను పూర్తిగా తొలిచేస్తూ నిబంధలనకు తూట్లు పొడుస్తున్నారని, కోర్టు చెప్పిన కూడా కొత్తగా తవ్వకాలు చేసిన చోటు నిర్మాణాలు చేపడుతున్నారని పేర్కొంటూ ఆయన తన పిటిషన్ ను దాఖలు చేశారు.
వాస్తవానికి 5.18 ఎకరాల మేరకే నిర్మాణాలు సాగించవచ్చని కేంద్ర అటవీ శాఖ మరియు పర్యావరణ శాఖ అనుమతులు ఇవ్వగా వాటిని అతిక్రమించి వందల చెట్లు కొట్టివేసి కొత్తగా భవంతుల నిర్మాణానికి సమాయత్తం అవుతున్నారని పిటిషనర్లు కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మరో రెండు వారాలు ఇలానే తవ్వితే కొండ ఉండదని, తవ్వాక వ్యర్థాలను సముద్రంలో పారబోస్తున్నారని తెలిపారు. సంబంధిత ఫొటోలు న్యాయస్థానం ముందు ఉంచారు.
ఈ నేపథ్యంలో కొండలు తవ్వితే తిరిగి పెంచలేమని., చెట్లను నరికివేస్తే వాటి స్థానంలో మళ్లీ మొక్కలు నాటి కాస్తో కూస్తో పర్యావరణంను కాపాడుకునేందుకు వీలుంటుందని కోర్టు వ్యాఖ్యానించింది. చెట్లనే కాదు కొండలనూ మరింత జాగ్రత్తగా కాపాడుకోవాలి అని కోర్టు వ్యాఖ్యానించింది.
Comments 1