టీడీపీ అధినేత, ప్రతిపక్ష నేత చంద్రబాబుపై ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వివాదాస్పద వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. చంద్రబాబుపై దాడి జరిగితే తామేమీ చేయలేమంటూ వైసీపీ కార్యకర్తలను రెచ్చగొట్టేలా సజ్జల చేసిన కామెంట్లపై తెలుగు తమ్ముళ్లు మండిపడుతున్నారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగా లేదనేందుకు సజ్జల వ్యాఖ్యలే నిదర్శనమని పలువురు టీడీపీ నేతలు విమర్శలు గుప్పిస్తున్నారు.
ఈ నేపథ్యంలోనే సజ్జలపై నెల్లూరు నగర ఇన్చార్జి కోటం రెడ్డి శ్రీనివాసులురెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు నాయుడిని టచ్చేసే దమ్ము, ధైర్యం సజ్జలకు, వైసీపీ నేతలకు ఉందా అంటూ సవాల్ విసిరారు. ప్రభుత్వ అసమర్థతకు సజ్జల వ్యాఖ్యలు నిదర్శనమని దుయ్యబట్టారు. సజ్జల వీధికుక్కలా మొరుగుతున్నారని, చంద్రబాబుపై దాడి చేయమని వైసీపీ కార్యకర్తలను ఉసిగొల్పేలా ఆయన వ్యాఖ్యలున్నాయని విమర్శించారు.
సజ్జల వ్యాఖ్యలను సుమోటోగా తీసుకుని డీజీపీ కేసు నమోదు చేయాలని కోటంరెడ్డి శ్రీనివాసులు రెడ్డి డిమాండ్ చేశారు. వైసీపీకి ఓటెయ్యకపోతే ప్రభుత్వ పథకాలు కట్ చేస్తామని బెదిరిస్తున్నారని, ఎవరిసొమ్ముతో పథకాలు నడుపుతున్నారో చెప్పాలని డిమాండ్ చేశారు. వైసీపీకి దమ్ముంటే విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను ఆపాలని, ప్రత్యేకహోదా తేవాలని సవాల్ విసిరారు.