మాట తప్పడు-మడమతిప్పడు! అని వైసీపీ నేతలు జగన్ గురించి చెప్పడమే గాని జగన్ మాట తప్పిన ప్రామిస్ లు రాస్తే బైబిల్ కంటే పెద్ద గ్రంథం తయారవుతుంది. ఉద్యోగుల సీపీఎస్ రద్దుతో మొదలైన మడమ తిప్పడం…. అలా రికార్డులు బద్దలు కొడుతూనే ఉంది.
ఏపీ సీఎం జగన్.. నిజంగానే మడమ తిప్పడం లేదా? మాట తప్పడం లేదా? అంటే.. ఎందుకు లేదు! అంటున్నారు గుంటూరు జిల్లా చిలకలూరి పేట జనాలు. ఎందుకంటే.. గత 2019 ఎన్నికల సమయంలో ఇక్కడ నుంచి పోటీ చేయాల్సిన మర్రి రాజశేఖర్..ను కాదని.. విడదల రజనీ అనే కొత్త ముఖానికి అవకాశం ఇచ్చారు. ఈ సమయంలో మర్రికి ఎమ్మెల్సీ ఇచ్చి.. తన కేబినెట్లో మంత్రి పదవి ఇస్తానని హామీ ఇచ్చారు. రాష్ట్రంలో ఎవరికైనా మంత్రి పదవి ఇస్తానని జగన్ హామీ ఇచ్చి ఉంటే.. ఇద్దరికే. ఒకటి మర్రి, రెండు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి. ఆ ఇద్దరికి జగన్ హ్యాండిచ్చేశాడు.
ఆళ్ల పరిస్థితి పక్కన పెడితే.. మర్రికి మాత్రం అడుగడుగునా అన్యాయం జరుగుతూనే ఉంది. ఇప్పటి వరకు అనేక మందికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చినా.. మర్రిని కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదు. తాజాగా ఆరుగురు శాసనసభ కోటాలో ఎమ్మెల్సీ పదవులకు అర్హులు అయ్యారు. వీరిలో ఆది నుంచి మర్రి పేరు ఉంటుందని అందరూ అనుకున్నారు. తీరా.. జాబితా వచ్చాక.. మర్రి పేరు మచ్చుకైనా కనిపించలేదు.
తాజాగా ఖరారైన వారిలో చల్లా భగీరథరెడ్డి(చల్లా రామకృష్నారెడ్డి కుటుంబం). శ్రీకాకుళం నుంచి దువ్వాడ శ్రీనివాస్, అనంతపురం నుంచి మహ్మద్ ఇక్బాల్, చిత్తూరు నుంచి బల్లి కల్యాణ్ చక్రవర్తి, సీనియర్ నాయకుడు సి. రామచంద్రయ్య, విజయవాడ నుంచి కరీమున్నీసా పేర్లు ఉన్నాయి.
కానీ, అదేసమయంలో అత్యంత కీలకమైన.. మర్రి రాజశేఖర్ విషయాన్ని మాట మాత్రంగా కూడా ప్రస్తావించలేదు. మరి ఆయనకు జగన్ ఇచ్చిన మాట .. మరిచిపోయారు. దాదాపు ఐదేళ్లపాటు.. టీడీపీ సర్కారుసమయంలో పాదయాత్ర చేసి మరీ చిలకలూరిపేటలో పార్టీని బలోపేతం చేశారు. జగన్ పాదయాత్ర సమయంలో నిధులు కూడాఖర్చు చేశారని అంటారు.
కేడర్ ను బలోపేతం చేసిన అలాంటి నాయకుడికి జగన్ ఎందుకు అన్యాయం చేస్తున్నారు. కేవలం కమ్మ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు కాబట్టేనా? ఇదే ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఇక, ఇప్పట్లో మళ్లీ ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అయ్యే పరిస్థితి లేదు. మరి ఇప్పుడు కూడా మర్రిని పట్టించుకోలేదంటే.. జగన్ మాట తప్పి.. మడమ తిప్పేసినట్టేనా?!