సౌమ్యంగా.. నిదానంగా ఆచి తూచి వ్యవహరించే యువ నాయకుడిగా గుర్తింపుపొందిన టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి.. నారా లోకేష్.. కొత్త అవతారం ఎత్తారు. ఫైర్ బ్రాండ్ నాయకుడిగా మారిపోయారు. అధికార పార్టీపై తీవ్రస్థాయిలో మాటల తూటాలు పేల్చారు. గతానికి భిన్నంగా ఆయన తన మాటలకు పదును పెంచారు. పంచాయతీ ఎన్నికల్లో ఎవరి సత్తా ఏమిటో బయటపడిందని.. జగన్‌రెడ్డి పిల్లి, చంద్రబాబు పులి అని తేలిందని విమర్శలు గుప్పించారు. 151 సీట్లు గెలిచామని చెప్పుకొనే జగన్‌రెడ్డి.. పంచాయతీ ఎన్నికలనగానే తొలుత తోక ముడిచారని ఎద్దేవా చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా 95 శాతం పంచాయతీ స్థానాలను తామే గెలుస్తామని ప్రగల్భాలు పలికిన వైసీపీ నాయకు లకు ఫలితాల అనంతరం బొమ్మ కనిపించిందని లోకేష్ తన సహజ శైలికి భిన్నంగా విమర్శలు చేశారు. కిడ్నాప్‌లు, బెదిరింపులు, హత్యలు, అధికార దుర్వినియోగం, ఏకగ్రీవాల కోసం పోలీసులతో ఒత్తిడి చేయడం ద్వారా గెలుపునకు వైసీపీ నాయకులు అడ్డదారులు తొక్కారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పంచాయతీ ఎన్నికల్లో ఫ్యాన్ స్పీడ్ తగ్గిందని, పురపోరులో తిరగడం పూర్తిగా ఆగిపోతుందని వ్యాఖ్యానించారు. అంతేకాదు.. టీడీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు పాల్పడినవారికి వడ్డీతో సహా చెల్లిస్తామని హెచ్చరించారు.
జగన్‌రెడ్డి ఒక పిరికిపంద. ప్రజల విశ్వాసం కోల్పోయాడు. ఎన్నికల్లో ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. వైసీపీ నేతలకు వత్తాసు పలుకుతున్న అధికారులపై చర్యలు తప్పవు అని లోకేష్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. నిజానికి వైసీపీలో ఫైర్ బ్రాండ్లు ఎక్కువగా ఉన్నారు. వారు మాట్లాడితే.. ఫాలోయింగ్ ఎక్కువగా ఉంటుందనే వ్యాఖ్యలు ఉన్నాయి. అయితే..ఇప్పుడు ఈ జాబితాలోకి లోకేష్ కూడాచేరిపోయారు. ఆయన కూడా ఫైర్ బ్రాండ్ స్థాయిని అందిపుచ్చుకున్నారు. ప్రస్తుతం లోకేష్ చేసిన తాజా వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండడం గమనార్హం.