పీఆర్సీ అడగరు..
సీపీఎస్ ఊసెత్తరు
ఐదు డీఏలు రావలసి ఉన్నా నోరు మెదపరు
స్థానిక ఎన్నికలతో వారి ప్రాణాలకు ముప్పట!
నిర్వహిస్తే బహిష్కరిస్తారట!
రాష్ట్ర ఎన్నికల కమిషన్‌పై అనుచిత విమర్శలు
స్కూళ్లు, కాలేజీలన్నీ తెరిచిన ప్రభుత్వం
ఊరూవాడా వైసీపీ కార్యక్రమాలు
సీఎం పుట్టిన రోజు, ఇళ్ల పట్టాల పండగలు
వాటిపై నోరెత్తని ఉద్యోగ నేతలు
ప్రభుత్వ పెద్దల ప్రాపకం కోసం ఉద్యోగ సంఘాల నేతలు తహతహలాడుతున్నారు. సీఎం జగన్ వారి ముఖమే చూడకున్నా.. గంటల తరబడి ఆయనతో చర్చలు జరిపేశామని.. తమ డిమాండ్లకు అంగీకరించేశారని మీడియా ఎదుట డప్పులు కొట్టుకునే ఈ నేతలు.. తమ పరిధి దాటి వ్యవహరిస్తున్నారు. పెద్దల మెప్పు పొందడానికి రాజ్యాంగబద్ధ సంస్థ అయిన రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎస్ఈసీ)పై దాడికి తెగబడుతున్నారు. వైసీపీ నాయకుల కంటే తీవ్రమైన ఆరోపణలు చేస్తున్నారు. కరోనా విజృంభిస్తుంటే స్థానిక ఎన్నికలు ఎలా పెడతారని నిలదీస్తున్నారు. స్థానిక ఎన్నికలు వాయిదా వేయకపోతే తామే బహిష్కరిస్తామంటున్నారు. అసలీ సంఘాలు ఎందుకున్నాయి? ఉద్యోగుల డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వంతో చర్చలు జరపడానికే కదా! జగన్ సీఎం అయ్యాక ప్రత్యక్షంగా ఆయన్ను కలిసి ఒక్క అంశంపైనైనా చర్చించారా? లేనేలేదు. సీఎం సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డిని కలవడానికే నానా తిప్పలు. పీఆర్సీ, ఐదు డీఏల గురించి ఆయనతో మాట్లాడడమే తప్ప.. ఇంతవరకు ఒక్క హామీ కూడా పొందలేకపోయారు. ఎన్నికల ప్రచారంలో, పాదయాత్ర సందర్భంగా.. తాను గద్దెనెక్కిన వారం రోజుల్లో కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం (సీపీఎస్) రద్దుచేసి.. పాత విధానం పునరుద్ధరిస్తానని జగన్ వాగ్దానం చేశారు. ఇప్పటికి సింహాసనం అధిష్ఠించి 19 నెలలైనా దిక్కూమొక్కూ లేదు. ఐదు డీఏలకు గాను ఒక్కటి కూడా ఇవ్వలేదు. మూడు ఇస్తామని చెప్పి.. కరోనా సాకుతో రెండ్రోజులకే ఫ్రీజ్ విధించారు. కరోనా సమయంలో కాంట్రాక్టర్లకు వేల కోట్లు చెల్లించిన సీఎం.. నిరుడు ఉద్యోగుల మార్చి, ఏప్రిల్ నెలల వేతనాల్లో సగం కోత పెట్టారు. వడ్డీతో చెల్లించాలని హైకోర్టు ఆదేశించడంతో ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జనవరిలోపు చెల్లిస్తే వడ్డీ మాఫీ చేస్తామని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఇంతవరకు ఆ బకాయిలు చెల్లించలేదు. ఉద్యోగ సంఘాల నేతలు పల్లెత్తు మాటనలేదు. ఇక వేతన సవరణ ఊసే ఎత్తడం లేదు. పొరుగు రాష్ట్రం తెలంగాణలో కనీసం ఉద్యోగుల నేతలతో అక్కడి ప్రభుత్వం చర్చలైనా జరుపుతోంది. ఇక్కడ ఆ మాట వినరాదు.. కనరాదు. నోరెత్తితే ఏసీబీ దాడులు చేయిస్తామని ప్రభుత్వ పెద్దలు బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. ఏపీ ఎన్జీవో సంఘాన్ని జగన్ అమాంతం చీల్చేశారు. నిబంధనలకు విరుద్ధంగా కొత్తగా ప్రభుత్వ ఉద్యోగుల సంఘాన్ని ఏర్పాటు చేయించి.. వెంటనే గుర్తింపు కూడా ఇచ్చేశారు. అయినా ఎన్జీవో సంఘఽంలో చలనం లేదు. స్వలాభం కోసం ప్రభుత్వ అణచివేత చర్యలపై గళమెత్తే సాహసం చేయలేకపోతున్నారు. కానీ రాజ్యాంగబద్ధ సంస్థ అయిన రాష్ట్ర ఎన్నికల సంఘం, కమిషనర నిమ్మగడ్డ రమేశ్‌కుమార్‌పై వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ.. మంత్రులు, వైసీపీ నేతలను తలపింపజేస్తున్నారు. ‘కరోనా ఉన్నప్పుడు ఎన్నికలు పెట్టి మా ప్రాణాలు బలితీసుకుంటున్నారు’ అన్నట్లుగా మండిపడ్డారు. రాష్ట్రంలో 8వేల నుంచి పదివేల కరోనా కేసులు నమోదవుతున్న సమయంలో ప్రభుత్వం తమపట్ల కఠినంగా వ్యవహరించినప్పుడు వీరిలో ఎంతమంది స్పందించారనే అంశంపై ఇప్పుడు ఉద్యోగుల్లో చర్చ జరుగుతోంది. ‘‘కొవిడ్ తీవ్రంగా ఉంది. ఆఫీసులకు రోజూ రావడం కష్టం. 50 శాతం మాత్రమే హాజరవుతాం’’ అని సచివాలయ ఉద్యోగులు వేడుకున్నా ప్రభుత్వం పట్టించుకోలేదు. సీఎస్ స్వయంగా వారి విజ్ఞప్తిని తోసిపుచ్చారు. అనేక శాఖాధిపతుల కార్యాలయాలు ఇరుకు ఇరుకుగా, గాలీ వెలుతురు లేని గదుల్లో నడుస్తున్నాయి. అయినా సరే, రోజూ డ్యూటీకి రావాల్సిందే అని ప్రభుత్వం తేల్చి చెప్పింది. ఇప్పుడు కరోనా పేరిట ఎస్ఈసీపై దండయాత్ర చేస్తున్న ఉద్యోగ సంఘాల నేతలు… అప్పుడు ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదు.
సహచరులు బలైపోయినా…
కరోనా కేసులు ప్రబలంగా ఉన్న సమయంలోనే చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో వైసీపీ ఎమ్మెల్యే భారీ ప్రదర్శన చేశారు. ఆ తర్వాత అక్కడ కొవిడ్ బారినపడిన వారి సంఖ్య గణనీయంగా పెరిగింది. స్వయంగా ప్రభుత్వ ఉద్యోగులే ఎంతోమంది బాధితులయ్యారు. పెద్దసంఖ్యలో రెవెన్యూ ఉద్యోగులు మరణించారు. అప్పుడీ ఉద్యోగ నేతలు నోరుమెదపలేదు. మాస్కులు లేవన్న నర్సీపట్నం డాక్టర్ సుధాకర్, నగరి మున్సిపల్ కమిషనర్‌పై సస్పెన్షన్ వేటు వేస్తే అయ్యో అని కూడా అనలేదు. కరోనాతో మరణించిన ప్రభుత్వ ఉద్యోగులెవరికీ సర్కారు నుంచి ప్రత్యేక సహాయం అందలేదు. కరోనా తగ్గడం, పెరగడం అనే వాదనలను పక్కనపెడితే… రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు వందశాతం నడుస్తున్నాయి. ఇప్పటికే పాఠశాలలు, కళాశాలలను ప్రారంభించారు. ఇప్పటి వరకు ప్రారంభించని విద్యాసంస్థలను కూడా ఈనెల 18 నుంచి ప్రారంభించాలని ఆదేశించారు. ఆర్టీసీ బస్సులు కిక్కిరిసి నడుస్తున్నాయి. ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం జోరుగా జరుగుతోంది. ఊరూరా సభలు పెట్టి మరీ పట్టాలు ఇస్తున్నారు. రేషన్ షాపుల ముందు ప్రజలు క్యూల్లో నిల్చుంటున్నారు. అనేక కార్యక్రమాల్లో ఉద్యోగులూ విధిగా పాల్గొంటున్నారు. ఉద్యోగ సంఘాల నేతలకు నిజంగా తమ సహచరుల ప్రాణాలు, భద్రతపట్ల ఆందోళన ఉంటే… ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలను ఎందుకు ప్రశ్నించలేదు? పంచాయతీ ఎన్నికలను మాత్రమే ఎందుకు వ్యతిరేకిస్తున్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫిబ్రవరిలో పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ఎస్ఈసీ నిర్ణయం తీసుకోగానే ఉద్యోగ సంఘాల నేతలకు ఎక్కడలేని కోపమొచ్చింది. అయితే… సరిగ్గా అంతకుముందురోజే వైసీపీ కీలక నేత, ఎంపీ విజయసాయి రెడ్డి ‘ఏప్రిల్‌లో స్థానిక ఎన్నికలు నిర్వహిస్తాం’ అని బహిరంగంగా ప్రకటించారు. ఫిబ్రవరిలో ఎన్నికలొద్దంటున్న ఉద్యోగ నేతలు… ఏప్రిల్‌లో కూడా వాటిని జరపొద్దని, కాదూ కూడదని షెడ్యూలు ఇస్తే ఎన్నికల విధులను బహిష్కరిస్తామని చెప్పగలరా? తిరుపతి ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల కమిషన్ షెడ్యూలు జారీ చేస్తే వ్యతిరేకిస్తారా? మార్చి 31 తర్వాత నిమ్మగడ్డ రమేశ్ కుమార్ పదవీకాలం పూర్తయ్యాక… ప్రభుత్వం స్థానిక ఎన్నికలకు సిద్ధమైతే, ఇదే ఉద్యోగ సంఘాల నేతలు ‘ససేమిరా’ అనగలరా? అంత సాహసం చేయగలరా? నిమ్మగడ్డను తిట్టడం ద్వారా ప్రభుత్వ పెద్దల ప్రాపకం సంపాదించాలన్నది వీరి ప్రయత్నం. ప్రజలు ఇది అర్థం చేసుకోలేని అమాయకులు కారు. చాలా రాష్ట్రాల్లో లోక్‌సభ ఉప ఎన్నికలు జరిగాయి. పొరుగున ఉన్న తెలంగాణలో గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలను నిర్వహించారు. రాజస్థాన్ నుంచి కేరళ దాకా ఎన్నో రాష్ట్రాల్లో స్థానిక ఎన్నికలు జరిగాయి. బిహార్‌లో ఏకంగా అసెంబ్లీ ఎన్నికలనే నిర్వహించారు. దేశవ్యాప్తంగా 54 అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. ఆయా రాష్ట్రాల ఉద్యోగ సంఘాల నేతలెవరూ ఎన్నికల నిర్వహణను ప్రశ్నించలేదు. ‘విధులు బహిష్కరిస్తాం’ అని హెచ్చరించనూ లేదు. పైగా… అప్పటితో పోల్చితే ఇప్పుడు దేశంలో, మన రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. అయినప్పటికీ… ఎస్ఈసీపై విమర్శలు గుప్పించడానికి కారణమేమిటో ప్రజలు ఊహించలేరా? పైగా ఎన్నికలు జరిగాక బిహార్, హరియాణాల్లో కరోనా కేసులు పెరిగాయని ప్రభుత్వం పచ్చి అబద్ధాలాడుతుంటే ఉద్యోగ నేతలు డూడూ బసవన్నల్లా తలూపుతున్నారు.
ఎందుకీ పాట్లు..?
విజయ దశమి తర్వాతి రోజున మహిళా ఉద్యోగులకు సెలవు ఇస్తూ నాటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నీలం సాహ్ని జీవో జారీచేశారు. సీఎం ముఖ్య కార్యదర్శి ప్రవీణ్ ప్రకాశ్ జోక్యం చేసుకుని.. ఆ జీవోను రద్దు చేశారు. దీనిపై ఉద్యోగ సంఘాల నేతలెవరూ స్పందించలేదు. నిజానికి… గతంలో ఏ ప్రభుత్వం ఉన్నా ఉద్యోగ సంఘాల నాయకులకు గౌరవం, విలువ ఇచ్చేది. వారు కోరుకున్నప్పుడు ముఖ్యమంత్రి అపాయింట్మెంట్ దక్కేది. ఇప్పుడు… సీన్ మొత్తం మారిపోయింది. పైగా… ఎవరైనా ఉద్యోగుల సమస్యలపై కొంచెం గట్టిగా మాట్లాడినా, పిలిచి క్లాస్ తీసుకుంటున్నారు. దీంతో వారు ‘గప్‌చుప్’. ఇక… పదవీ విరమణ ముందు ప్రభుత్వాన్ని ప్రసన్నం చేసుకుంటే మంచిదని కొందరు ఉద్యోగ నేతలు పడరాని పాట్లు పడుతున్నారనే ఆరోపణలున్నాయి.