పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. బెబ్బులిలాగా రెచ్చిపోయారు. వాస్తవానికి ఆమె గురించి చెప్పుకోవడమే తప్ప.. ఎవరూ ఇటీవల కాలంలో ఈ రేంజ్లో విజృంభిస్తుందని అనుకోలేదు. కానీ.. తాజాగా ఆమె పిడుగులు కురిపించారు. మాటల శతఘ్నులను పేల్చారు.
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ.. కేంద్రంలో అధికార పార్టీ బీజేపీపై రెచ్చిపోయారు. తాను గాయపడిన పులినని.. పంజా విసిరితే ఎలా ఉంటుందో రుచి చూపిస్తానని.. సంచలన కామెంట్లు కుమ్మరించారు. ప్రస్తుతం మమతా బెనర్జీ చేసిన కామెంట్లు.. హాట్ టాపిక్‌గా మారాయి. జాతీయ స్థాయిలో ఈ కామెంట్లపై చర్చ జరుగుతుండడం గమనార్హం.
పశ్చిమ బెంగాల్‌లోని హుగ్లీలో… షాన్‌గంజ్ సభలో తాజాగా మమతా బెనర్జీ ప్రసంగించారు. ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షాలు సహా బీజేపీపై పిడుగులు కురిపించారు. ప్రధాని మోడీ పెద్ద ఎత్తున అల్లర్లు సృష్టించే వ్యక్తి అంటూ తీవ్రంగా విరుచుకుపడ్డారు. అబద్ధాలను ప్రచారం చేస్తూ, దేశ వ్యాప్తంగా విద్వేషాన్ని పెంచి పోషిస్తున్నారని ఆరోపించారు.
ప్రధాని మోడీ అల్లర్లు సృష్టించే వ్యక్తి. అల్లర్ల ద్వారా ట్రంప్ సాధించిందేంటి? అంతకంటే ఘోరమైన ఇబ్బందులను మోడీ ఎదుర్కొంటారు. హింస ద్వారా సాధించేది ఏమీ లేదు అని మమత నిప్పులు చెరిగారు. వచ్చే ఎన్నికల్లో తామే గోల్కీపర్లమని, బీజేపీ ఒక్క గోల్‌నూ సాధించలేదని బల్లగుద్ది మరీ చెప్పారు.
‘‘నన్ను చంపండి. కొట్టండి. అంతేగానీ మా కోడలిని అవమానపరుస్తారా? బొగ్గు దొంగ అని విమర్శిస్తారా? మమ్మల్ని బొగ్గు దొంగ అని పిలుస్తారా? మీరేమైనా మచ్చలేని వారా? మీ గురించి మాకన్నీ తెలుసు. కానీ అంత కింది స్థాయికి నేను దిగలేను’’ అని ఘాటుగా విమర్శించారు.
దేశాన్ని బెంగాలీలతో పాటు ఇతరులు కూడా పాలించారని, ఇతరులు బెంగాలీల వెన్నెముకలను తుంచడానికి ప్రయత్నించాని విమర్శించారు. వారు బెంగాల్‌ను పాలించడానికి చూస్తున్నారని, బెంగాల్‌ను బెంగాల్ లాగా ఉంచాలని, బీజేపీ బెంగాల్‌ను ఏం చేయాలనుకుంటోందో చెప్పాలని ఘాటుగా నిలదీశారు. గుజరాతీలు బెంగాల్‌ను ఎన్నడూ పరిపాలించలేరని విరుచుకుపడ్డారు.
వచ్చే ఎన్నికల్లో బీజేపీని బెంగాల్లో చిత్తుచిత్తుగా ఓడగొడితే… దేశం నలుమూలలా బీజేపీని ఓడించడం అసాధ్యమేమీ కాదని మమత పేర్కొన్నారు. ‘‘నన్ను పాతిపెట్టినా చెట్టులా విస్తరిస్తూనే ఉంటా. ఆట మొదలైంది. గాయపడిన పులి చాలా ప్రమాదకారి. పంజా దెబ్బను రుచి చూపిస్తుంది. బెంగాల్లో బీజేపీని ఓడిస్తే.. భారత రాజకీయ చిత్ర పటంపై ఆ పార్టీ కనుమరుగవుతుంది. ఇది ఖాయం’’ అని మమత ఓటర్లకు పిలుపునిచ్చారు.
ప్రస్తుతం మమత వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. దేశంలో మోడీని ఎవరూ ఇంతగా తిట్టిపోసిన దాఖలాలు ఇటీవల కాలంలో లేకపోవడం గమనార్హం.