టీడీపీ తరఫున 2019 ఎన్నికల బరిలో నిలిచి గెలిచిన ఎమ్మెల్యే వల్లభనేని వంశీ ఆ తర్వాత గోడ దూకి వైసీపీకి మద్దతు ప్రకటించిన సంగతి తెలిసిందే. తన పదవికి రాజీనామా చేసి మళ్లీ ఉప ఎన్నికకు వెళ్లకుండా ఉన్న వంశీ…అసెంబ్లీలో ఇటు టీడీపీ సభ్యుడిగా కాకుండా…అటు వైసీపీ సభ్యుడిగా కాకుండా…ఓ ప్రత్యేక సభ్యుడిగా కూర్చుంటున్నారు. ఇక, గన్నవరంలో ఆల్రెడీ వైసీపీ నేతగా ఉన్న యార్లగడ్డ వెంకట్రావుకు, వల్లభనేని వంశీకి మధ్య ముందు నుంచి ఆధిపత్య పోరు నడుస్తోంది.
గన్నవరంలో తాను ముందు నుంచి వైసీపీ నేతగా ఉన్నానని వెంకట్రావు అంటుండగా…తాను జగన్ చెప్పినట్లు నడుచుకుంటున్నానని వంశీ అంటున్నారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధం తాజాగా తార స్థాయికి చేరింది. దీంతో, గన్నవరంలో వైసీపీ రాజకీయం గరం గరంగా మారింది. రాబోయే ఎన్నికల్లో గన్నవరం టికెట్ తనదేనని వెంకట్రావు అంటుంటే…ఆ టికెట్ తనకు ఖాయమని వంశీ కూడా కాన్ఫిడెంట్ గా ఉన్నారు.
ఈ క్రమంలోనే ఈ ఇద్దరు వైసీపీ నేతలు ఒకరిపై ఒకరు ఆరోపణలు, విమర్శలు చేసుకుంటున్నారు. గన్నవరం పరిధిలో గతంలో ఇసుక దోపిడీ జరిగిందని, దానిపై విచారణ జరిపించాలని వెంకట్రావు డిమాండ్ చేస్తున్నారు. చంద్రబాబునుగానీ, జగన్ నుగానీ తాను వ్యక్తిగతంగా తిట్టలేదని, తాను టీడీపీలోకి వెళుతున్నానన్న మాట అవాస్తవమని అంటున్నారు.
దీంతో, వెంకట్రావు వ్యాఖ్యలకు వల్లభనేని వంశీ కౌంటర్ ఇచ్చారు. జగన్ మద్దతు తనకేనని, తాను గెలిచినా ఓడినా గన్నవరంలోనే ఉన్నానని, అప్పుడప్పుడు వచ్చిపోయేవారి గురించి తాను అస్సలు పట్టించుకోనని అన్నారు. తాను నిర్మించిన సినిమాల్లో వెంకట్రావు లాంటి క్యారెక్టర్లు చాలా ఉన్నాయని, తాను విలన్ అయితే.. ఆయనేమో మహేశ్ బాబా? అంటూ ఎద్దేవా చేశారు. ఎవరికి సీట్ ఇవ్వాలో జగన్ నిర్ణయిస్తారని, జగన్ పనిచేయాలని సూచించారని, తాను చేస్తున్నానని చెప్పారు. మిగతా వారి గురంచి పార్టీనే చూసుకుంటుందన్నారు. మరి, గన్నవరం వైసీపీలో ముసలంపై జగన్ స్పందన ఏమిటన్నది ఆసక్తికరంగా మారింది.