ఏపీలో సీఎం జగన్ ది నియంత పాలన అని ప్రతిపక్ష పార్టీల నేతలు విమర్శలు గుప్పిస్తున్న సంగతి తెలిసిందే. వైసీపీ నేతలలో మెజారిటీ నేతలు డమ్మీలని, వారంత జగన్ చెప్పినట్లు తల ఊపడం తప్ప మరేమీ చేయలేరని టీడీపీ సహా మిగతా విపక్ష పార్టీల నేతలు కూడా విమర్శిస్తున్నారు. గతంలో జగన్ అపాయింట్ మెంట్ కోసం చాలామంది ఎమ్మెల్యేలు కూడా పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఉందని టాక్.
ఆ విషయాన్ని వైసీపీ రెబల్ ఎంపీ ఈ విషయం మీడియాముఖంగా వెల్లడించిన తర్వాత కొంతమందికి అపాయింట్ మెంట్ దొరుకుతోందని టాక్ ఉంది. జగన్ పాలనలో రెడ్ల హవా నడుస్తోందని, ఏపీ మొత్తంపై ఐదుగురు రెడ్లు పెత్తనం సాగిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా వైసీపీ నేతలపై, జగన్ పాలనపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలోని 26 జిల్లాలలో ఐదుగురు రెడ్లు మాత్రమే పెత్తనం చెలాయిస్తున్నారని ఆయన షాకింగ్ కామెంట్లు చేశారు.
జగన్ మోహన్ రెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి…ఇలా ఈ ఐదుగురు రెడ్లే పాలన చేస్తున్నారని విమర్శించారు. రాష్ట్రంలో జగన్ నియంత పాలన సాగిస్తున్నారని రామకృష్ణ ధ్వజమెత్తారు. ఏపీలో పాత మంత్రులైనా, కొత్త మంత్రులైనా….ఏ ఒక్క మంత్రికి కూడా అధికారాలు లేవని రామకృష్ణ స్పష్టం చేశారు. మంత్రులు ధర్మానతో పాటు బొత్స సహా కేబినెట్లోని మంత్రులంతా డమ్మీలేనని ఆరోపించారు.
హోం మంత్రిగా ఉన్న మహిళా నేతకు కనీసం ఎస్సైని బదిలీ చేసే అధికారం కూడా లేదని, ఇది రాష్ట్రంలో జగన్ నియంతృత్వానికి పరాకాష్ట అని విమర్శించారు. సాధారణంగా ప్రభుత్వంపై వామపక్ష నేతలు ఈ రేంజ్ లో విమర్శలు గుప్పించిన దాఖలాలు గతంలో లేవు. ప్రభుత్వ విధానాలను వ్యతిరేకించడం, ధర్నాలు, రాస్తారోకోలు, బంద్ లు చేయడం వరకే దాదాపుగా వారు పరిమితమయ్యేవారు. ఆఖరికి వారు కూడా జగన్ పాలనపై విసుగెత్తి ఈ తరహా కామెంట్లు చేయడం విశేషం.