వైసీపీ అధినేత, సీఎం జగన్ వచ్చే ఎన్నికల్లో 175 అసెంబ్లీ స్తానాలు గెలవడం మాట అటుంచితే.. వచ్చే ఎన్నికలే జగన్‌కు, వైసీపీకి చివరి ఎన్నికలని చంద్రబాబు ఎద్దేవా చేశారు. రాజకీయాల్లో ఉండే అర్హత కూడా జగన్‌కు లేదని అన్నారు. రాజ్యాంగ ఉల్లంఘన చేసిన కారణంగానే రాజకీయాల్లో ఉండే అర్హతను జగన్ కోల్పోయారన్నారు. పథకాలకు 300 యూనిట్లు నిబంధన, మూడు రాజధానులు అని ముందే చెప్పి ఉంటే ప్రజలు అప్పుడే తాట తీసేవారన్నారు. వ్యవసాయాన్ని నాశనం చేశారు కాబట్టే రైతులు క్రాప్ హాలిడే ప్రకటించారని చెప్పారు.
జగన్‌ది ఐరన్ లెగ్ అన్న చంద్రబాబు.., వ్యవస్థలను ధ్వంసం చేశారు కాబట్టే అరిష్టం పట్టిందన్నారు. పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్ అయిన పిల్లలకు భరోసానిస్తూ..మీటింగ్ పెడితే దొంగల్లా దూరారని, దాన్ని ఏ2 సమర్థిస్తాడా ? అంటూ మండిపడ్డారు. ఏ2 విజయసాయి రెడ్డికి ఎవ్వరూ భయపడరని..,’వస్తానంటే రమ్మనండి.. చూద్దాం’ అని సవాల్ చేశారు. వ్యవస్థలను నాశనం చేసి రౌడీయిజం చేయాలనుకుంటారా ? అంటూ దుయ్యబట్టారు.
మంగళగిరిలో అన్న క్యాంటీన్ పడగొట్టడంపై చంద్రబాబు ధ్వజమెత్తారు. స్వచ్ఛంధంగా భోజనం పెట్టే వారిని అరెస్ట్ చేస్తారా ? అంటూ మండిపడ్డారు. ఫైబర్ గ్రిడ్, స్కిల్ డెవలప్మెంట్, అవుటర్ రింగ్ రోడ్, ఇన్నర్ రింగ్ రోడ్ అంటూ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ఎవరో ఒకర్ని తీసుకువచ్చి చంద్రబాబు, లోకేశ్, అచ్చెన్న పేర్లు చెప్పమని ఒత్తిడి చేస్తారా? అని నిలదీశారు. పోలీసులు రాజకీయాలు చేయటం మొదలు పెడితే వారే బలవుతారన్నారు.
సుప్రీంకోర్టు నిబంధనలకు విరుద్ధంగా పోలీసులు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చట్ట ప్రకారం వ్యవహరించని వారిని ఎదిరించే శక్తి టీడీపీకి ఉందని చంద్రబాబు స్పష్టం చేశారు. శాంతియుతంగా ఉండే రాష్ట్రాన్ని మూడేళ్లలో వల్లకాడు చేశారని ధ్వజమెత్తారు. మాజీ మంత్రి వివేకా హత్య కేసు సంబంధీకులను చంపేస్తారని ముందునుంచి చెబుతూనే ఉన్నామని..,తాము చెప్పినట్లే జరగుతోందని అన్నారు.