నవరత్నాలు-ఈ కాన్సెప్ట్.. 2019 ఎన్నికల్లో వైసీపీ అధినేత జగన్ నోటి నుంచి అలవోకగా వచ్చిన పథకం. తాను అధికారంలోకి వస్తే.. నవరత్నాలు అమలు చేస్తానంటూ.. ఆయన పదేపదే చెప్పుకొచ్చారు. తాను చేసిన పాదయాత్ర లో నిత్యం ఇదే నామస్మరణ వినిపించారు. ఇక, ఆయన పార్టీ నాయకులు కూడా ఇదే మాట పట్టుకుని ఊగులాడారు. ఇక, అధికారంలోకి వచ్చిన తర్వాత నవరత్నాల అమలు చూస్తూనే ఉన్నాం.. ఎన్ని ఊగిసలాటలు.. ఎన్ని అప్పులు.. ఎన్ని ఎత్తుపల్లాలు.. అబ్బో.. ఎంత తక్కువ చెప్పుకొంటే.. అంత ఎక్కువ! అన్నట్టుగా ఈ నవరత్నాల అమలు ఉంది.
అయితే.. జగనన్న నవరత్నాల సెగ.. ఇప్పుడు పంచాయతీ ఎన్నికలకు కూడా పాకింది. ఇప్పటి వరకు మూడు దశల పంచాయతీ ఎన్నికలు జరుగుతున్నాయి. వీటిలో ఎవరూ ఈ విషయాన్ని ప్రస్థావించలేదు.
అయితే.. తాజాగా జరుగుతున్న నాలుగో దశ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేస్తున్న వైసీపీ మద్దతు దారు మాత్రం.. తనను గెలిపిస్తే.. `పంచరత్నాలు` అమలు చేస్తానంటూ.. ప్రజలకు హామీ ఇచ్చాడు. అంతేకాదు.. ఈ హామీలకు సంబంధించి.. 20 రూపాయల రిజిస్టర్ స్టాంపు పత్రంపై నోటరీ చేయించి.. సంతకం పెట్టి మరీ ప్రజల మధ్యకు దిగడం గమనార్హం.
మరి ఇంతకీ.. ఆ అభ్యర్థి ఎవరు.. ఆ పంచరత్నాల కథేంటంటే..
అభ్యర్థి : పడాల రంగారెడ్డి
జిల్లా : తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంమండలం, ఊబలంక గ్రామం.
పోటీ చేస్తున్న పదవి: ఊబలంక గ్రామ సర్పంచ్
మద్దతిస్తున్న పార్టీ: వైసీపీ
తనను గెలిపిస్తే.. పడాల రంగారెడ్డి ప్రకటించిన పంచరత్నాలు:
1) ఏడాదిపాటు గ్రామప్రజలకు కేబుల్ టీవీ ప్రసారాలు ఉచితం
2) ఏడాది పాటు ఊబలంక గ్రామ ప్రజలకు రేషన్ ఉచితం
3) ఏడాది పాటు ప్రజలకు మినలర్ వాటర్ ఫ్రీ..
4) ఏడాది పాటు ప్రజలకు బీపీ, షుగర్ టెస్టులు ఫ్రీ..
5) హైస్కూల్ విద్యార్థులు పదిమందికి 10 వేల సాయం
కొసమెరుపు: పడాల రంగారెడ్డి చేసిన ఈ పంచరత్నాల హామీని చూస్తున్న ప్రజలు.. నవ్విపోతున్నారు. ఇదెలా సాధ్యంరా బాబోయ్!! అని గిల్లి చూసుకుంటున్నారు.