మీరు పోలీసులా ? వైసీపీ బానిసలా ? అంటూ నిన్నటి వేళ తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఇవి ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చకు తావిస్తున్నాయి. అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఇప్పటిదాకా తమను అణచివేసేందుకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారని, అంతేకాని శాంతిభద్రతల పర్యవేక్షణకు మాత్రం కాస్త శ్రద్ధ కూడా చూపడం లేదని చంద్రబాబు ఆగ్రహం వ్యక్తంచేశారు. రాష్ట్రంలో డీజీపీ ఉన్నారా అని ప్రశ్నించారు. పోలీసు వ్యవస్థ నడుస్తున్న తీరుపై, వారి ఏకపక్ష ధోరణులపై చంద్రబాబు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
ముఖ్యంగా అన్నా క్యాంటీన్ల ధ్వంసం మొదలుకొని వివేకా కేసులో దర్యాప్తు బృందాలపై అనుసరిస్తున్న తీరు వరకూ ఆయన అసంతృప్తి వ్యక్తం చేస్తూ విలేకరులతో మాట్లాడారు. అదే విధంగా ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో తన వాదన వినిపిస్తూ, ఆధారాలతో సహా ప్రభుత్వ వైఫల్యాలను వివరిస్తూ వెళ్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ చేస్తున్న అక్రమాలు, అన్యాయాలను వివరిస్తూనే, తాము ఏ విధంగా వీటిని ప్రతిఘటిస్తున్నామో అన్నది కూడా ప్రజలకు వివరించేందు తమ అధినేత మరింత పోరాటం చేసేందుకు సిద్ధం అవుతున్నారని టీడీపీ శ్రేణులు చెబుతున్నాయి. ఇంకా ఆయనేమన్నాంటే…
రాజ్యాంగబద్ధంగా పనిచేయాల్సిన పోలీసులు అధికారంలో ఉన్నవారికి లొంగి బానిసల్లా వ్యవహరిస్తున్నారు. వారు హత్యలూ, అరాచకాలూ, అక్రమాలకు వంత పాడుతున్నారు. పోలీసు శాఖను తాడేపల్లి నౌకరు పాలిస్తున్నారు. అందుకే డీజీపీలు మారినా ఆ శాఖ తీరు మారడం లేదు అని తీవ్ర స్వరంతో వ్యాఖ్యానించారు. వేధింపుల విభాగంగా సీఐడీ తయారైందని కూడా అంటూ తమ నేతలను ముఖ్యంగా మహిళా నేతలను ఏ విధంగా వేధిస్తున్నారో ప్రజలంతా గమనిస్తున్నారని చెబుతూ, ప్రజాస్వామ్య స్ఫూర్తిని విఘాతం తెచ్చే విధంగా పాలన ఉందన్న అర్థం ధ్వనించే విధంగా మాట్లాడి, సంబంధిత వ్యవస్థలో లోపాలను మరోసారి వెలుగులోకి తెచ్చారు.