జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ ఘటన ఇరు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన సంగతి తెలిసిందే. ఈ గ్యాంప్ రేప్ నిందితులకు కొందరు రాజకీయ నాయకులు అండగా ఉన్నారని, ఆశ్రయం కూడా ఇచ్చారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావ్ ముందు నుంచి ఆరోపిస్తున్నారు. వారిని కాపాడేందుకు విశ్వప్రయత్నాలు జరుగుతున్నాయని, కేసును నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్నారని సాక్ష్యాధారాలతో సహా రఘునందన్ బయటపెట్టారు.
ఈ క్రమంలోనే తాజాగా రఘునందన్ రావ్ కు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మద్దతిచ్చారు. ఆయన చెప్పిందే నిజమనిపిస్తోందని వర్మ అభిప్రాయపడ్డారు. ఈ కేసు విచారణ ప్రక్రియలో రాజకీయ నాయకుల జోక్యం కచ్చితంగా ఉందని ఆర్జీవీ అనుమానం వ్యక్తం చేశారు. ఓ సాధారణ వ్యక్తి కోణం నుంచి తాను చూస్తున్నానని, ఈ విషయంలో రఘునందన్ రావు వాదనే నిజం అని తనకు అనిపిస్తోందని అన్నారు. మిగతా వారు కేసును పక్కదారి పట్టిస్తున్నారని, ఇది విచారకరమని వర్మ చెప్పారు.
మరోవైపు, ఈ గ్యాంగ్ రేప్ కేసులో నిందితుల 3 రోజుల పోలీసు కస్టడీకి నాంపల్లి కోర్టు అనుమతించింది. దీంతో పోలీసులు ఏ-1 సాదుద్దీన్ ను కస్టడీలోకి తీసుకొని విచారణ జరపనున్నారు. 3 రోజుల కస్టడీ రేపటి నుంచి మొదలు కానుంది. ప్రస్తుతం చంచల్గూడ జైలులో రిమాండ్ ఖైదీగా సాదుద్దీన్ ఉండగా…మరో ఐదుగురు మైనర్ నిందితులు జువైనల్ హోంలో ఉన్నారు. ఈ కేసులో మొత్తం ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్న సంగతి తెలిసిందే.
అయితే, మిగతా నిందితులైన ఐదుగురు మైనర్లను కూడా కస్టడీలోకి తీసుకొని విచారణ చేసేందుకు పోలీసులు జువైనల్ జస్టిస్ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దాని విచారణ జరగాల్సి ఉంది. ఏ-1 అయిన సాదుద్దీన్ కు ఏడు రోజుల కస్టడీ ఇవ్వాలని జూబ్లీహిల్స్ పోలీసులు కోరినా, కోర్టు మూడు రోజుల అనుమతే ఇచ్చింది.