ఆత్మ హత్యలు వద్దు.. అంటూ టీడీపీ లీడర్ చినబాబు నారా లోకేశ్ పిలుపు ఇస్తూ ఓ ప్రకటన చేశారు. అదేవిధంగా టెన్త్ ఫలితాలు ఆశించిన రీతిలో కాకుండా అందుకు భిన్నం అయిన పద్ధతిలో రావడం పై కూడా ఆయన విశ్లేషణ ఒకటి ఇచ్చారు.
పదో తరగతి ఫలితాలు, వీటి తీరుతెన్నులపైనే ప్రస్తుతం అంతా మాట్లాడుతున్నారు. వీలున్నంత వరకూ రాజకీయ పార్టీలు కూడా మాట్లాడేందుకు, వీలున్నంత వరకూ వీటిని విశ్లేషించేందుకు, కారణాలు వెలుగులోకి తెచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇందులో భాగంగా చదువులు ఒకప్పటి కన్నా ఇప్పుడు బాగా వెనుకబడిపోవడానికి కారణం ఏంటి ? ఇదే ప్రశ్నతో విపక్షాలు జగన్ – ను కార్నర్ చేస్తున్నాయి.
ముఖ్యంగా అధ్యాపక సిబ్బంది కొరతతోనే ఎక్కువ చోట్ల సమస్యలు ఉన్నాయని, అదేవిధంగా మూల్యాంకనంలో కూడా చాలా లోపాలు ఉన్నాయని తెలుస్తోంది. పునః మూల్యాంకనంతో కొన్ని జీవితాలు ఒడ్డెక్కుతాయని కూడా కొందరు భావిస్తున్నారు. రీ కౌంటింగ్ అయినా, రీ వాల్యుయేషన్ అయినా సక్రమంగా జరిగితే, మరింత మంది విద్యార్థుల భవిష్యత్ అగమ్యగోచరం కాకుండా ఉండడం ఖాయం.
రీ కౌంటింగ్ కోసం ఒక్కో సబ్జెక్టుకు 500 రూపాయలు చెల్లించాలని చెబుతోంది. అదేవిధంగా సప్లిమెంటరీ పరీక్ష ఫీజు సైతం నేటి నుంచి కట్టుకోవచ్చని, అయితే వీరు పరీక్షలు రాసి పాసైతే రెగ్యులర్ విద్యార్థుల కిందకే వస్తారని, వీరికి సంబంధించి ఈ నెల 13 నుంచి ప్రత్యేక తరగతులు నిర్వహిస్తామని కూడా విద్యాశాఖ చెబుతోంది. రీ వెరిఫికేషన్ కమ్ సప్లై ఆఫ్ ద ఆన్సర్ స్క్రిప్ట్స్ కోసం వెయ్యి రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని సంబంధిత అధికార వర్గాలు చెబుతున్నాయి. https://cfms.ap.gov.in/ ద్వారా చెల్లించవచ్చు. వీరికి ఆఖరి గడువు ఈ నెల 20 వరకూ !
రీ వెరిఫికేషన్ కు డబ్బులు చెల్లించిన వారు, రీ కౌంటింగ్ కు వేరుగా చెల్లించాల్సిన అవసరం లేదని కూడా యంత్రాంగం చెబుతోంది. ఈ నేపథ్యంలో టీడీపీ యువనేత నారా లోకేశ్ మరో సారి సామాజిక మాధ్యమాల ద్వారా స్పందించారు. ఆయన ఏం అన్నారంటే ..
“నాడు – నేడు అంటూ మూడేళ్ళుగా ప్రభుత్వం చేసిన ఆర్భాటపు ప్రచారానికీ, నిన్న వచ్చిన పదో తరగతి ఫలితాలకీ పొంతనే లేదు. టీడీపీ హయాంలో 90 నుంచి 95 శాతం ఉన్న ఉత్తీర్ణత…ఇప్పుడు 67 శాతానికి పడిపోవడం రాష్ట్రంలో పాఠశాల విద్యా వ్యవస్థ దుస్థితికి నిదర్శనం.
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ లేకపోవడం, వారికి బోధనేతర పనులు అప్పగించడం, బడుల విలీనం సహా ప్రభుత్వం తీసుకున్న పలు అస్తవ్యస్త విధానాలే నేటి ఈ పరిస్థితికి కారణం. జగన్ చెప్పిన నాడు-నేడు అంటే లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడమేనా ? విద్యార్థులను, వారి తల్లిదండ్రులను వేదనకు గురి చెయ్యడమేనా ?
రెండు లక్షలమందికి పైగా విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయే పరిస్థితికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇక్కడ ఫెయిల్ అయ్యింది ప్రభుత్వ వ్యవస్థలే తప్ప ! విద్యార్థులు కాదు అని అంతా గుర్తించాలి. పరీక్షల్లో తప్పామని విద్యార్థులు ఆత్మహత్యల వంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు.
స్టూడెంట్స్ ధైర్యంగా ఉండాలి. వ్యవస్థలో లోపాలకు మీరు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యార్థి లోకానికి విజ్ఞప్తి చేస్తున్నా.. ” అని చెప్పారాయన.