నిబంధనల్ని పాటించని అధికారులకు ఎలాంటి పరిస్థితి ఎదురవుతుందన్న దానికి నిదర్శనంగా తాజా ఉదంతం నిలుస్తుంది. భార్యభర్తలకు చెందిన వివాదంలో భార్య ఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా చేసుకొని.. కేసు నమోదు చేసే క్రమంలో హైదరాబాద్ కు చెందిన నలుగురు పోలీసు అధికారులు వ్యవహరించిన వైఖరిని తీవ్రంగా తప్పు పట్టిన తెలంగాణ హైకోర్టు.. వారికి నాలుగు వారాలు జైలుశిక్ష విధిస్తూ ఇచ్చిన ఆదేశం సంచలనంగా మారింది. ఇంతకు వారు చేసిన భారీ తప్పు.. నిబంధనల్ని తూచా తప్పకుండా ఫాలో కాకపోవటమే.
సాధారణంగా ఎవరైనా ఎవరి మీదనైనా ఫిర్యాదు ఇచ్చినప్పుడు 41ఏ సీఆర్ పీసీ సెక్షన్ కింద నోటీసులు ఇవ్వాల్సి ఉంటుంది. వారి నుంచి వచ్చిన సమాధానం ఆధారంగా పోలీసులు తీసుకోవాల్సిన చర్య తీసుకోవాల్సి ఉంటుంది. అందుకు భిన్నంగా.. అలాంటివేమీ ఫాలో కాకుండా తమకు తోచినట్లుగా వ్యవహరించిన తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంతకూ ఈ వివాదం ఏమిటి? అది కాక నలుగురు పోలీసు అధికారులకు జైలు వరకు వెళ్లిన ఉదంతం ఏమిటన్న విషయంలోకి వెళితే..జక్కా వినోద్.. జక్కా సౌజన్యలు భార్యభర్తలు. వీరిద్దరి మధ్య వివాదాలు ఉన్నాయి.
ఈ నేపథ్యంలో భర్త మీద భార్య పోలీసు అధికారులకు ఫిర్యాదు చేసింది. నిబంధనల ప్రకారం భర్త మీద భార్య ఫిర్యాదు చేసినప్పుడు.. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసు అధికారులు.. 41ఏ సీఆర్ సీపీ కింద నోటీసులు ఇవ్వాలి. దర్యాప్తు చేయాలి. కంప్లైంట్ ఎవరి మీద వచ్చిందో వారి నుంచి వచ్చిన సమాధానం ఆధారంగా.. తమ విచారణలో తేలిన అంశాల్ని పరిగణలోకి తీసుకొని తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
అందుకు భిన్నంగా ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే.. ఫిర్యాదును ఆధారంగా చేసుకొని ఛార్జిషీట్ దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న జక్కా వినోద్ హైకోర్టును ఆశ్రయించారు. తనకు ఎలాంటి నోటీసులు ఇవ్వలేదన్న విషయాన్ని హైకోర్టు ముందుంచారు. దీనిపై వాదనలు విన్న హైకోర్టు జాయింట్ సీపీ ఏఆర్ శ్రీనివాస్ (ప్రస్తుతం.. అప్పట్లో డీసీపీ).. బంజారాహిల్స్ ఏసీపీ సుదర్శన్.. జూబ్లీహిల్స్ సీఐ రాజశేఖర్ రెడ్డి.. ఎస్ ఐ నరేశ్ లకు నాలుగు వారాలు జైలుశిక్ష విధించటంతో పాటు శాఖాపరమైన చర్యలు తీసుకోవాలంటూ షాకింగ్ నిర్ణయాన్ని వెల్లడించింది.
అయితే.. జైలుశిక్షను వెంటనే అమలు చేయకుండా.. తమ ఆదేశాలపై అప్పీలుకు వెళ్లేందుకు వీలుగా శిక్ష అమలును ఆరు వారాలు వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో వారు అప్పీలుకు వెళ్లి.. తమ వాదనను వినిపించటం ద్వారా జైలుశిక్ష నుంచి ఉపశమనం పొందే వీలుందని చెబుతున్నారు. అయితే.. శాఖాపరమైన చర్యల విషయంలో వారికి ఇబ్బందులు తప్పవన్న మాట వినిపిస్తోంది. ఈ ఆదేశంతో హైదరాబాద్ పోలీసులు ఉలిక్కిపడటమే కాదు.. పెద్ద ఎత్తున చర్చ జరిగేలా చేసింది.