జగన్ సర్కారు వరుస వైఫల్యాలతో ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రభుత్వ ఉపాధ్యాయుల చేత బోధన తప్ప అన్ని ఇతర పనులు అప్పగించి విద్యార్తులకు చదువును దూరం చేసిన పాపం ఇది.
స్కూళ్లను అద్భుతంగా తీర్చిదిద్దతాం, చంద్రబాబు ప్రభుత్వం కంటే గొప్పగా చదువు చెప్పిస్తాం అని చెప్పి చివరకు విద్యార్థులను ఫెయిల్ చేసిన ఘనత ఈ ప్రభుత్వానిది.
ఏపీలో విద్యా వ్యవస్థ పరిస్థితిపై తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆవేదన వ్యక్తంచేశారు. ఆయన ఏమన్నారంటే…
నాడు-నేడు అంటూ మూడేళ్ళుగా ప్రభుత్వం చేసిన ఆర్భాటపు ప్రచారానికి, నిన్న వచ్చిన పదో తరగతి ఫలితాలకి పొంతనే లేదు. టిడిపి హయాంలో 90-95 శాతం ఉన్న ఉత్తీర్ణత…ఇప్పుడు 67 శాతానికి పడిపోవడం రాష్ట్రంలో పాఠశాల విద్యా వ్యవస్థ దుస్థితికి నిదర్శనం.
ఉపాధ్యాయ పోస్టుల భర్తీ లేకపోవడం,వారికి బోధనేతర పనులు అప్పగించడం,బడుల విలీనం సహా ప్రభుత్వం తీసుకున్న పలు అస్తవ్యస్థ విధానాలే నేటి ఈ పరిస్థితికి కారణం. జగన్ చెప్పిన నాడు-నేడు అంటే లక్షల మంది విద్యార్థులు ఫెయిల్ అవ్వడమేనా?విద్యార్థులను,వారి తల్లిదండ్రులను వేదనకు గురి చెయ్యడమేనా?
రెండు లక్షలమందికి పైగా విద్యార్థులు ఒక విద్యా సంవత్సరాన్ని కోల్పోయే పరిస్థితికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. ఇక్కడ ఫెయిల్ అయ్యింది ప్రభుత్వ వ్యవస్థలే తప్ప విద్యార్థులు కాదు అని అంతా గుర్తించాలి.
పరీక్షల్లో తప్పామని విద్యార్థులు ఆత్మహత్యల వంటి అఘాయిత్యాలకు పాల్పడవద్దు. స్టూడెంట్స్ ధైర్యంగా ఉండాలి. వ్యవస్థలో లోపాలకు మీరు ప్రాణాలు తీసుకోవాల్సిన అవసరం లేదని విద్యార్థి లోకానికి విజ్ఞప్తి చేస్తున్నా.