ఇప్పుడు ఎక్కడ చూసినా, ఎవ్వరిని కదిలించినా వినిపించే మాట ఒక్కటే మాట అదే పదో తరగతి ఫలితాలు. రెండేళ్ల కరోనా కారణంగా ఫలితాలు అన్నీ పరీక్షలు లేకుండానే డిక్లైర్ అయిపోయాయి.కేవలం హాజరు శాతం ఆధారంగా వాళ్లంతా ఒడ్డెక్కిపోయారు. రెండేళ్ల తరువాత వైసీపీ సర్కారుకు పదో తరగతి పరీక్షలు నిర్వహించే అవకాశం వచ్చినా, ఆ అవకాశాన్ని కూడా సద్వినియోగం చేసుకోలేదన్నది టీడీపీ వినిపిస్తున్న ఆవేదన.
టీచర్ల నియామకం విషయమై తీవ్ర నిర్లక్ష ధోరణితో ఉన్న కారణంగానే, ఉన్నవారికి కూడా అదనపు పనులు అప్పగింతలు చేసిన కారణంగానే విద్యార్థుల చదువులు ముందుకు సాగలేదన్నది టీడీపీ అభియోగం. ఈ నేపథ్యంలో పదో తరగతి ఫలితాలపై టీడీపీ నాయకుడు నారా లోకేశ్ స్పందించారు. ఈ సందర్భంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు.నాడు నేడు పేరిట మూడు వేల 500 కోట్ల రూపాయలు దుర్వినియోగం అయ్యాయని ఆరోపించారు.
విద్యా రంగాన్ని నిర్వీర్యం చేసిన ఘనత వైసీపీ సర్కారుకే చెందుతుందని మరో ఆరోపణ చేశారు. నారా లోకేశ్ తో పాటు మరో వైపు మాజీ విద్యాశాఖ మంత్రి, ప్రస్తుత విశాఖ నార్త్ ఎమ్మెల్యే గంటా శ్రీను కూడా స్పందించారు. ఆయన కూడా దాదాపు ఇలాంటి ఆరోపణలే చేశారు. రాజకీయం కోసం కాదు కానీ విద్యార్థుల భవిష్యత్ కోసమే తాము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నామని, ఇప్పటికైనా వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని గంటా శ్రీను అన్నారు.
నారా లోకేశ్ ఏమన్నారంటే…
“విడుదలైన టెన్త్ ఫలితాల్లో విద్యార్థులు ఫెయిల్ కాలేదని, జగన్ రెడ్డి ప్రభుత్వం విద్యావ్యవస్థని భ్రష్టు పట్టించి పరీక్షల నిర్వహణలో ఫెయిల్ అయ్యింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్రెడ్డి తాను పదో తరగతి కష్టపడి చదివి పాసై ఉంటే, విద్యార్థుల కష్టాలు తెలిసేవి. పరీక్షలు నిర్వహించడం దగ్గర నుంచి ఫలితాలు ప్రకటించేవరకు అంతా అస్తవ్యస్తం, గందరగోళం.
చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయుల్ని నాడు-నేడు పనులకి కాపలా పెట్టారు. దీంతో వారు పిల్లలకి చదువు చెప్పడం మానేసి, పాఠశాలల మరమ్మతుల పనుల్లో నిమగ్నమయ్యారు. నాడు (2018) టీడీపీ ప్రభుత్వం నిర్వహించిన టెన్త్ పరీక్షల్లో 94.48 శాతం ఉత్తీర్ణత సాధిస్తే, నేడు 67.26 శాతం దిగజారడమేనా వైసీపీ ప్రభుత్వం సాధించిన ప్రగతి ?
తూర్పు గోదావరి జిల్లా, బెండపూడిలో పదేళ్లుగా ప్రసాద్ అనే టీచర్ ఎన్నారైల సహకారంతో విద్యార్థినులను అమెరికన్ ఇంగ్లీషులో మాట్లాడేలా తీర్చిదిద్దితే, ఆ ఘనత కూడా తన ఖాతాలో వేసుకున్న సీఎం..టెన్త్ దారుణ ఫలితాలు కూడా తన ఖాతాలోనే వేసుకోవాలి.
పాఠాలు చెప్పే ఉపాధ్యాయులను తన మద్యం బ్రాండ్లు అమ్మే షాపులకి కాపలా పెట్టిన సీఎమ్మే దిగజారిన ఫలితాలకు ప్రధాన కారకుడు ప్రస్తుత సీఎం. పాఠాలు చెప్పే ఉపాధ్యాయుల్ని సీపీఎస్ రద్దు, ఫిట్మెంట్ హామీలతో మోసగించడంతో వారు ఆందోళనలతో రోడ్డెక్కి, బోధనకి దూరం చేసింది జగన్ సర్కారే ! ” అని అన్నారాయన. ఆరోపించారాయన.