వచ్చే ఎన్నికల గురించి ఇప్పటి నుంచే ఆపసోపాలు పడుతున్నారు కేఏ పాల్. దేవుడి విశ్వాసిగా, క్రైస్తవ మత ప్రచార కర్తగా ఉన్న కేఏపాల్ ఇప్పుడు ఇక్కట్లలో ఉన్నారు. ప్రజాశాంతి పార్టీ తరఫున తొలి అభ్యర్థిని ప్రకటించి తెలంగాణలో సంచలనం అయ్యారు.
ఉద్యమంలో అమరుడు అయిన శ్రీకాంతాచారి (ఆత్మాహుతి చేసుకున్నారీయన) తండ్రి వెంకటాచారికి టికెట్ ఇవ్వడంతో సంచలనం అయ్యారు. అయితే ఇంతకుమించిన సంచలనం మరొకటి నమోదు అయింది. అదేంటంటే పచ్చని కాపురంలో చిచ్చు పెట్టవద్దని చెబుతూ శ్రీకాంతాచారి తల్లి శంకరమ్మ అంటున్నారు. తమ కుటుంబం జోలికి వస్తే కాళ్లు విరగ్గొడతామని అంటున్నారు. దీంతో ఇప్పుడీ వివాదం పెరిగి పెద్దది కానుంది.
వాస్తవానికి తామంతా కేసీఆర్ పార్టీ అయిన టీఆర్ఎస్ ను వీడబోమని, వచ్చే ఎన్నికల్లో అమరుల కుటుంబాలకు సంబంధించి ఒక్కో కుటుంబానికి పదిలక్షల రూపాయలు పరిహారం చెల్లిస్తామని, ఇల్లు కట్టించి ఇస్తామని చెప్పిన వారికి, మాట ఇచ్చిన వారికి, ఆ విధంగా మాట ఇచ్చాక నిలబెట్టుకుంటాం అన్న నమ్మకం కలిగిన వారికే తాము మద్దతు ఇస్తామని శంకరమ్మ అంటున్నారు.
ఇక బీజేపీ, టీఆర్ఎస్ యుద్ధం ఎలా ఉన్నా, కేఏపాల్ అనే వ్యక్తి కేసీఆర్ కు పెద్ద తలనొప్పిగానే మారిపోయారు. తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ టైం నుంచి ఆయన ఏదో ఓ విధంగా అధికార పార్టీని ఇరకాటంలో పెడుతూనే ఉన్నారు. ఎలా అయినా తెలంగాణ లో పరువు నిలబెట్టుకుని తీరాలన్న ఆరాటంలో ఉన్న పాల్ కు, అసలు ఆయన మరో సారి ఇటుగా వచ్చేందుకు కూడా ఆలోచన చేయకూడదన్న విధంగా ఉన్న టీఆర్ఎస్ కు మధ్య తరుచూ జరుగుతున్న మాటల యుద్ధం మరోస్థాయికి చేరుకుంది.
ఈ దశలో వెంకటాచారి పోటీ చేసే విషయమై ఎటూ తేలడం లేదు. అదేవిధంగా పాల్ మరో మాట కూడా అంటున్నారు. శ్రీకాంతాచారి అమరుడుడయిన డిసెంబర్ 3, 2009 నే తెలంగాణ అవతరణ సాధ్యం అయిందని భావించి, ప్రతి ఏటా ఆ రోజును తెలంగాణ ఆవిర్భావంగా గుర్తించాలని కూడా అంటున్నారు. ఇది కూడా తెలంగాణ రాష్ట్ర సమితిని ఆలోచనలో పడేసింది. దీంతో మళ్లీ అమరుల చుట్టూనే రాజకీయం నడుస్తోంది.