ఈ సోషల్ మీడియా జమానాలో సినీ తారలకు, వారి అభిమానులకు మధ్య ఉన్న గ్యాప్ చాలా తగ్గిపోయింది. అభిమానులతో సమంత రూత్ ప్రభు మొదలు అనసూయ వరకు అందరూ ట్విటర్, ఫేస్ బుక్, ఇన్ స్టా లలో ఫ్యాన్స్ తో టచ్ లో ఉంటున్నారు. అనసూయ వంటి బ్యూటీకి సోషల్ మీడియాలో ఫ్యాన్స్ కూడా విపరీతంగానే ఉన్నారు. అప్పుడపుడు తన అభిమానుల కోసం అనసూయ ఫేస్ బుక్ లైవ్ చాట్ లోకి కూడా వచ్చి సందడి చేస్తుంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే రంగమ్మత్తకు…ఫ్యాన్స్ నుంచి ట్రోలర్స్ నుంచి విమర్శలు కూడా వస్తుంటాయి.
అయితే, వారికి దీటుగా అనసూయ కూడా ఘాటుగానే రిప్లై ఇస్తూ ఉంటుంది. అనసూయ వేసుకున్న ఒక పొట్టి డ్రస్సుపై ఓ నెటిజన్ అభ్యంతరకర కామెంట్లు చేయగా…ఆమె కూడా అంతే ఘాటుగా రిప్లై ఇచ్చింది. ఇక, ఇదే కోవలో అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన హీరో సుశాంత్ కు సోషల్ మీడియాలో ఫ్యాన్ నుంచి ఓ కొంటె ప్రశ్న ఎదురైంది. ‘నువ్ వర్జినా..?’ అని ప్రశ్నించిన ఫ్యాన్ కు సుశాంత్ కూల్ గా ఇచ్చిన రిప్లై ఇపుడు వైరల్ గా మారింది.
ప్రస్తుతం రవితేజ హీరోగా రాబోతోన్న ‘రావణాసుర’ సినిమాలో సుశాంత్ ఓ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. దీంతో, సుశాంత్ తన అభిమానులతో సోషల్ మీడియా వేదికగా ముచ్చటించారు. తాను వర్జిన్ అని అర్థం వచ్చేలా ‘నేను నిప్పు’ అంటూ ఓ దీపం ఫొటో షేర్ చేశాడు సుశాంత్. ‘మీకు మౌంటైన్స్ అంటే ఇష్టమా..? లేక బీచ్ లా..?’ అని అడగ్గా.. బీచ్ లో ఉన్న ఫొటోను షేర్ చేశాడు సుశాంత్.
‘పెళ్లి రోజు ఎప్పుడు..?’ అనే ప్రశ్నకు ఆలోచిస్తున్నట్లు ఎమోజీ పెట్టిన సుశాంత్….రవితేజ చాలా మంచి వ్యక్తి అంటూ బదులిచ్చాడు. ఇక, నాగచైతన్య, అఖిల్ లలో ఒకరిని ఎన్నుకోమని అడగ్గా.. ప్రశ్నే తప్పు అబ్బాయ్ అంటూ ఫన్నీగా కామెంట్ చేశాడు. ఏది ఏమైనా…నెటిజన్లుకు సరదాగా ఈ అక్కినేని వారసుడు ఇచ్చిన సమాధానాలు ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.