రసగుల్లా…ఈ పేరు వినగానే స్వీట్ ప్రియులకు నోరూరుతుంది. కానీ, ఈ పేరు వింటే చాలు రైల్వే అధికారులకు ఒళ్లు మండుతోంది. ఎందుకంటే, ఈ రసగుల్లా చేసిన పనికి ఓ రాష్ట్రంలో రైల్వే వ్యవస్థ స్తంభించింది. ఒకటి కాదు రెండు కాదు, వందలాది రైళ్లకు ఈ రసగుల్లా బ్రేకులు వేసింది. ఈ బెంగాలీ పాపులర్ స్వీట్ దెబ్బకు మరికొన్ని రైళ్లు రద్దయ్యాయి. మరికొన్ని రైళ్లను దారి మళ్లించిన ఘనత కూడా ఈ మిఠాయిదే.
నోట్లో వేసుకుంటే తియ్యగా కరిగిపోయే రసగుల్లా ఇంత కఠినంగా రైళ్లను ఆపేంత సీన్ ఉందా అనుకుంటే మీరు పప్పులో…తప్పులో కాలేసినట్లే. బీహార్‌లో రీల్ లైఫ్ ను తలపించేలా జరిగిన ఈ రియల్ ఇన్సిడెంట్ గురించి చదివితే ముక్కున వేలేసుకోక మానరు. బీహార్ లోని బరహియా సమీపంలోని లక్షిసరాయి ప్రాంతం రసగుల్లాలకు పెట్టింది పేరు. ఈ పట్టణంలో సుమారు 200 పైగా రసగుల్లా షాపులున్నాయి. ఆ రసగుల్లాల రుచి చూసేందుకు సమీప నగరాలు, పట్టణాలు, గ్రామల నుంచి వందలాది మంది నిత్యం తరలివస్తుంటారు.
బరహియా రైల్వే స్టేషన్లో రైలు ఎక్కే, దిగే ప్రతి ఒక్కరూ ఈ రసగుల్లాలు కొనాల్సిందేనంటే అతిశయోక్తి కాదు. అయితే, కరోనా వల్ల అనివార్యమైన లాక్ డౌన్, కొన్ని రైలు సర్వీసుల రద్దు వల్ల రసగుల్లాల వ్యాపారం దెబ్బతింది. కరోనా తర్వాత చాలా రైళ్లను బరహియా స్టేషన్లో ఆపకపోవడంతో వ్యాపారులంతా రసగుల్లాల మీద ఈగలు తోలుకుంటున్నారు. దీంతో, రసగుల్లా వ్యాపారులంతా కలిసి ఇటీవల బరహియా స్టేషన్ సమీపంలోని రైల్వే ట్రాక్‌లపై టెంట్లు వేశారు. సుమారు 40 గంటల సేపు అక్కడే కూర్చొని తమ నిరసన తెలిపారు.
బరహియా రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే బరహియా మీదుగా వెళ్లే కనీసం 10 ఎక్స్‌ప్రెస్ రైళ్లను స్టేషన్లో గంటపాటు ఆపాలని డిమాండ్ చేశారు. అలాగైతేనే ప్రయాణికులు తమ షాపులకు వచ్చి రసగుల్లాలు కొంటారని అధికారులకు చెప్పారు. వ్యాపారుల రైల్ రోకో వల్ల అధికారులు ఢిల్లీ, హౌర మధ్య నడిచే వందలాది రైళ్లను రద్దు చేసి…మరికొన్ని రైళ్లను దారి మళ్లించారు. దీంతో, చివరకు వ్యాపారుల డిమాండ్‌కు రైల్వే అధికారులు దిగొచ్చారు. ఆ స్టేషన్ మీదుగా వచ్చే రైళ్లను కనీసం 60 నిమిషాలు నిలిపేలా చూస్తామని హామీ ఇవ్వడంతో వ్యాపారులు చల్లబడ్డారు.